పడిపోతున్న ఉష్ణోగ్రతలు
చలి తీవ్రత దష్ట్యా వృద్ధులు, పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వెచ్చని దుస్తులు ధరించడం, వేడి పానీయాలు తీసుకోవడం వంటివి చేయాలి. అత్యవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
భువనగిరి, భువనగిరి టౌన్ : జిల్లాలో చలితీవ్రత మరింత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలకు పడిపోయాయి. అత్యల్పంగా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలితీవ్రత వల్ల ఉదయాన్నే పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడు భారీ వర్షాల కారణంగా చలితీవ్రత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.
చల్లటి గాలులతో ఇబ్బందులు
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభమైంది. దీంతో చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు చలిగాలులు వీస్తుండటం ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. సాయంత్రం త్వరగా పనులు ముగించుకుని ఇంటికే పరిమితం అవుతున్నారు. ఉదయం 9 గంటల వరకు జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ప్రధానంగా కార్మికులు, రైతులు, పాల వ్యాపారులు తెల్లవారుజామున పనిచేయాల్సి వస్తుండడంతో చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో చలికి వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో చలిప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
నివారణ చర్యలు
చలి నుంచి రక్షణ పొందడానికి ఉన్ని దుస్తులు, శాలువాలు, మంకీ క్యాప్లు, స్వెటర్లు తప్పక ధరించాలి. ఇంట్లో హీటర్లు వాడుతున్నప్పుడు తగిన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. చలికాలంలో త్వరగా వచ్చే జలుబు, ఫ్లూ వంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధిక చలికి గురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఉష్ణోగ్రతలు
తేదీ గరిష్టం కనిష్టం
06 32.1 15
07 31.7 13.5
08 32.3 10.4
09 32.2 10.3
10 32.1 9
11 31.1 9.1
తూప్రాన్‌పేటలో 9 డిగ్రీలు
ఫ మిగతా ప్రాంతాల్లోనూ తగ్గుదల
ఫ మున్ముందు మరింత పడిపోయే అవకాశం


