నూతనకల్ మండలంలో టెన్షన్.. టెన్షన్..
సూర్యాపేట : నూతనకల్ మండలం లింగంపల్లిలో మంగళవారం రాత్రి బీఆర్‌ఎస్ నాయకుడు ఉప్పుల మల్లయ్య హత్యకు గురికావడంతో మండలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌కు ముందు రాజకీయ హత్య జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాదే మార్చి 17న నూతనకల్ మండలం మిర్యాలలో రాజకీయ ఆధిపత్య నేపథ్యంలో చక్రయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గత 15 సంత్సరాల నుంచి మండలంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వృద్ధురాలిపై దాడి చేసి పుస్తెలతాడు అపహరణ
చౌటుప్పల్ : ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిపై దుండగుడు దాడి చేసి ఆమె బంగారు పుస్తెలతాడును అపహరించుకెళ్లాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం కాట్రేవు గ్రామంలో బుధవారం జరిగింది. కాట్రేవు గ్రామానికి చెందిన గున్‌రెడ్డి రంగారెడ్డి, సత్తమ్మ దంపతుల కుమారులు జీవనోపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఈ దంపతులిద్దరే ఇంటి వద్ద ఉంటున్నారు. రోజుమాదిరిగానే బుధవారం తెల్లవారుజామున 5గంటలకు రంగారెడ్డి పాలు తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సత్తమ్మ ఇంట్లోనే నిద్రించింది. రంగారెడ్డి బయటకు వెళ్లేటప్పుడు తలుపులు పెట్టకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి సత్తమ్మ తలకు దుప్పటి చుట్టి ఆమెను కొట్టాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా.. దిండు కింద దాచి ఉంచిన నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడును దుండగుడు గుర్తించి దానిని తీసుకొని పారిపోయాడు. చోరీకి పాల్పడిన వ్యక్తి ముందుగానే వీధి లైట్లను ఆపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రికి రూ. 3లక్షల జరిమానా
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని టీఎన్‌ఆర్ ఆస్పత్రికి రూ.3లక్షల జరిమానా విధిస్తూ నల్లగొండ వినియోగదారుల కమిషన్ బుధవారం తీర్పు వెలువరించింది. కనగల్‌కు చెందిన ఐతరాజు శోభ గర్భకోశ సంబంధిత సమస్యతో టీఎన్‌ఆర్ హాస్పిటల్‌లో డాక్టర్ నాగేశ్వరావును సంప్రదించగా.. 2023 జనవరి 6న ఆమెకు సర్జరీ చేసి గర్భసంచి తొలగించారు. అయినా సమస్య తీరకపోవడంతో హైదరాబాద్‌లో చూపించగా.. ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. టీఎన్‌ఆర్ ఆస్పత్రి వైద్యుడి నిర్లక్ష్యంగా సర్జరీ చేయడంతోనే క్యాన్సర్‌కు దారితీసిందని శోభ కుటుంబ సభ్యులు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. విచారణ చేపట్టి బాధితురాలికి ఆస్పత్రి ఖర్చులకు గాను రూ.1,22,000 9శాతం వడ్డీతో, పరిహారం కింద రూ.2,20,000 చెల్లించాలని ఆదేశించారు.


