పవర్‌ఫుల్‌ పదవి.. ఉపసర్పంచ్‌ | - | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ పదవి.. ఉపసర్పంచ్‌

Dec 9 2025 10:49 AM | Updated on Dec 9 2025 10:49 AM

పవర్‌ఫుల్‌ పదవి.. ఉపసర్పంచ్‌

పవర్‌ఫుల్‌ పదవి.. ఉపసర్పంచ్‌

తిరుమలగిరి (తుంగతుర్తి) : గ్రామానికి సుప్రీం సర్పంచే అయినా ఉప సర్పంచ్‌ పదవి కూడా కొన్నిసార్లు కీలకం కానుంది. సర్పంచ్‌తో కలిసి అతడికి జాయింట్‌ చెక్‌ పవర్‌ ఉండడం, సర్పంచ్‌ను ఏదో కారణంగా తొలగిస్తే ఆ బాధ్యతలు ఉప సర్పంచ్‌కే అప్పగిస్తారు.

నిధుల వినియోగంలో కీలకం

గ్రామ పాలనలో ఉప సర్పంచ్‌ కీలక భూమిక పోషించనున్నారు. 2018 పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఉపసర్పంచ్‌కు కూడా కొన్ని అధికారాలు కల్పించారు. పంచాయతీ పరిధిలో నిధుల వినియోగంపై సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా ఉమ్మడి చెక్‌ పవర్‌ కట్టబెట్టారు. పాటు ప్రభుత్వ పథకాల అమలులో సర్పంచ్‌ విఫలమైతే.. అతను అవినీతికి పాల్పడినట్లు రుజువైతే కలెక్టర్‌ సర్పంచ్‌ను విధుల నుంచి తొలగిస్తారు. ఆ సమయంలో తిరిగి ఎన్నికలు జరిగే వరకు ఉపసర్పంచే గ్రామ పాలన బాధ్యతలు చేపడతాడు.

ఎక్కువ మంది ఆశావహులు

ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల మూలంగా సర్పంచ్‌ స్థానానికి పోటీ చేయలేని వారు కనీసం ఉపసర్పంచ్‌గా నైనా ఎన్నికవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. రిజర్వుడు స్థానాల్లో ఈ పోటీ తీవ్రంగా ఉంది. ఈ పోస్టు ఆశిస్తున్న వారు ముందుగా వార్డు మెంబర్‌గా ఎన్నికవడంతో పాటు తమ వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది వార్డు సభ్యులు విజయం సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డుల్లో గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకు ఆర్థిక చేయూతనందిస్తూ తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

పరోక్ష పద్ధతిలో ఎన్నిక

ఉపసర్పంచ్‌ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత వార్డు సభ్యులందరూ కలిసి ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. అయితే ఈ పదవికి పోటీ నెలకొంటే అధికారులు పంచాయతీ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి వార్డు సభ్యులు చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించి ఎవరికి ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉంటే వారినే ఉపసర్పంచ్‌గా నిర్ణయిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement