
రోడ్డు ప్రమాదాలు నివారించేలా..
ఆలేరు: హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నియంత్రణపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) దృష్టి సారించింది. ముఖ్యంగా హైవేలోని జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. ఈమేరకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు.
గడిచిన మూడు నెలల్లో
15 ప్రమాదాలు.. ముగ్గురు మృతి
ఆలేరులో 11 కి.మీ. హైవే ఉంది. గడిచిన మూడు నెలల్లో ఈ హైవేపై సుమారు 15 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఇందులో ముగ్గురు మృతి చెందగా దాదాపు 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
ఇవి కారణాలు
రోడ్డు ప్రమాదాలకు పలు కారణాలను పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సంయుక్తంగా గుర్తించారు. రహదారికి మధ్యలో వివిధ రకాల చెట్లు ఎత్తుగా పెరగటంతో జంక్షన్ వద్ద రోడ్డు దాటే సమయంలో వాహనాలు కనిపించక, లేదా వాహనదారులకు రోడ్డు క్రాసింగ్ చేసే వారు సడన్‌గా రావడం వల్ల రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నట్లు విచారణలో గుర్తించారు. అదేవిధంగా జంక్షన్ల వద్ద విద్యుత్ దీపాలు లేకపోవడం మరో కారణమని అఽధికారుల దృష్టికి వచ్చింది.
నివారణ చర్యలు
హైవే జంక్షన్ల వద్ద రహదారి మధ్యలో చెట్ల ఎత్తును తగ్గించాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. తద్వారా జంక్షన్ల నుంచి వంద మీటర్ల దూరం వరకు రహదారిపై వాహనాల రాకపోకలను గమనించి, రోడ్డు క్రాస్ చేసే వీలు కలగనుంది. దీంతో ప్రమాదాల నియంత్రణకు ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు. అదేవిధంగా హైవే జంక్షన్ల వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసే దిశగా ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాత్రి వేళ జంక్షన్ల వద్ద రోడ్డు క్రాస్ చేసే సమయంలో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా వాహనాల రాకపోకలను నిశితంగా గమనించే అవకాశం కలుగుతుంది. వాహనదారులను అప్రమత్తం చేసే విధంగా రోడ్డు హద్దులు తెలియడానికి రేడియంతో కూడిన రోడ్ స్టడ్స్, వైట్ రోడ్ మార్కింగ్ పనులు ఎన్‌హెచ్‌ఏఐ చేస్తోంది.
ఆలేరులోని నేషనల్ హైవే జంక్షన్‌లో ఏర్పాటు చేసిన రేడియంతో కూడిన రోడ్ స్టడ్స్
ఆలేరులో రహదారి మధ్యలో
మొక్కలను కట్ చేస్తున్న సిబ్బంది
హైవేలోని జంక్షన్ల వద్ద ప్రమాదాల
నియంత్రణపై ఎన్‌హెచ్‌ఏఐ దృష్టి
రహదారి మధ్యలో చెట్ల ఎత్తును
తగ్గిస్తున్న సిబ్బంది
రోడ్డు హద్దులు తెలిసేలా రేడియంతో కూడిన రోడ్ స్టడ్స్, వైట్ రోడ్ మార్కింగ్
అధికారులతో చర్చిస్తున్నాం
హైవేపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడాం. వారితో కలిసి ప్రమాదాలకు కొన్ని కారణాలను గుర్తించాం. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు రోడ్డు ప్రమాద నివారణ పనులపై దృష్టి పెట్టారు.
– వినయ్, ఆలేరు ఎస్‌ఐ

రోడ్డు ప్రమాదాలు నివారించేలా..

రోడ్డు ప్రమాదాలు నివారించేలా..