
పాటిమట్లలో బునాదిగాని కాల్వ భూసేకరణ సర్వే
మోత్కూరు : బునాదిగాని కాల్వ భూ సేకరణకుగాను మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామ రెవెన్యూ పరిధిలో మంగళవారం భూసేకరణ విభాగం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాటిమట్ల గ్రామంలో 92, 95 తదితర సర్వే నంబర్ల పరిధిలో 17.24 ఎకరాల్లో భూ సేకరణ కోసం ప్రాథమిక నివేదిక, కబ్జా, టైటిల్ డీడ్ నిర్దారణ, పట్టాదారుడి నిర్దారణ చేసినట్లు ఆయన తెలిపారు. దీని పరిధిలో 50 మందికి పైగా రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తులు ఇవ్వాలని, వాటిని జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ పరిశీలిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కొంత మంది రైతులు గతంలో బృందావన్ కాల్వ కోసం తమ భూములు పోయాయని, తిరిగి బునాదిగాని కాల్వ కోసం తమ భూములు కోల్పోతున్నామని డిప్యూటీ కలెక్టర్‌తో వాదనకు దిగారు. పాత అలైన్‌మెంట్ మేరకే సర్వే చేయాలని పట్టుబట్టారు. ఈమేరకు సుకన్య, మారుపాక భిక్షం, మారుపాక మంగమ్మ, చల్లా రామయ్య, చల్లా యాదయ్య, గొలుసుల ముత్తయ్య, గొలుసుల సోమయ్య, రాణిలతో పాటు 20 మంది రైతులు వినతిపత్రం అందజేశారు. భూసేకరణ విభాగం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంట తహసీల్దార్ జ్యోతి, భూసేకరణ డిప్యూటీ తహసీల్దార్ జయపాల్‌రెడ్డి, ఐబీ ఏఈ తరుణ్, ఆర్‌ఐ సుమన్, సర్వేయర్ ఖాజాఫరిదోద్దిన్, జీపీఓ నర్సింహ, హెచ్‌ఈఓ అరూరు నర్సింహ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎల్లేష్ ఉన్నారు.