
విద్యాబోధనలో ఇబ్బంది కలగకుండా చూడాలి
భువనగిరిటౌన్ : బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, విద్యాబోధనలో ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంత రావు, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ పాల్గొన్నారు.
ఉద్యోగులందరూ
సర్వేలో పాల్గొనాలి
భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 డాక్యుమెంట్ రూపొందిస్తోందని ఈ సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని కలెక్టర్ హనుమంత రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్–2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం పొందేలా సిటిజన్ సర్వే చేపట్టారని పేర్కొన్నారు. ఈనెల 25 వరకు జరిగే సర్వేలో ఉద్యోగులు పాల్గొనడంతోపాటు ఈ సర్వే లింక్ ను, క్యూర్‌ఆర్‌కోడ్ ను తమ కార్యాలయాల్లో ప్రదర్శించి విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సర్క్యూలర్ జారీ చేశారని తెలిపారు. సర్వేలో http://www.telangana.gov.in/telanganarising/ లింక్ ద్వారా పాల్గొనాలని పేర్కొన్నారు.
అవగాహన కల్పించాలి
బీబీనగర్: రెవెన్యూ చట్టంలోని నూతన విధానాలు, భూ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం బీబీనగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. భూ సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, డీటీ భగత్ తదితరులున్నారు.
షోకాజ్ నోటీసులు జారీ
బీబీనగర్: భూ సర్వేలకు ఎక్కువ సమయం తీసుకోవడం, సర్వే చేసిన వాటిని కావాలనే తిరస్కరించడంపై ఫిర్యాదులు రావడంతో మండల సర్వేయర్ అనితకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గూడూరు గ్రామంలోని పల్లె దవాఖానాను పరిశీలించేందుకు వెళ్లగా ఆస్పత్రి మూసి ఉండడంతో ఎంఎల్‌హెచ్‌పీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా బీబీనగర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన పోషణ మాస కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
గురుకుల పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు
భువనగిరి: 2025–26 విద్యా సంవత్సరానికిగాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతిలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి వెంకన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గత ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు హాజరై ఉండాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 15, 16, 17వ తేదీల్లో భువనగిరి పట్టణంలోని బైపాస్ రోడ్డు పక్కన గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు.
గాలికుంటు నివారణకు నేటి నుంచి టీకాలు
భువనగిరిటౌన్ : పశువులకు గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ సిద్ధమైంది. బుధవారం నుంచి నవంబర్ 15 వరకు నెల రోజుల పాటు 70శాతం టీకాలు అంటే 1,37,200 డోసులు పశువులకు వేయనున్నారు. 47 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి 74 పశు వైద్య శాలల పరిధిలో టీకాలు వేయనున్నారు.
పశు వైద్యశాఖ డాక్టర్లతో సమావేశం
భువనగిరిలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ జానయ్య ప్రాంతీయ పశు వైద్యశాఖ డాక్టర్లతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌తో కలిసి అధికారికంగా ప్రారంభించేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో టీకాల పంపిణీ ప్రక్రియను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించాలని పేర్కొన్నారు.