
వరిలో చీడపీడలు.. నివారణ
త్రిపురారం : వరి పంటలో వాతావరణ మార్పులకు అనుగుణంగా వచ్చే చీడపీడలను రైతులు సరైన సమయంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, లేకుంటే పంట దిగుబడులు తగ్గి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్, సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వరి పంటలో సోకే చీడపీడల నివారణకు రైతులకు ఆయన అందిస్తున్న సూచనలు.
అగ్గి తెగులు :
వరి పంటలో వచ్చే అగ్గి తెగులును సరైన సమయంలో గుర్తించి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 1.6 గ్రాములు లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నత్రజని ఎరువులను తగ్గించుకొని, పొలం గట్లపై ఉన్న కలుపును తీసివేయాలి.
మొగి పురుగు లేదా కాండతొలుచు పురుగు :
వరి పంటలో వాతావరణ పరిస్థితులను బట్టి కాండం తొలుచు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్‌పీ 2గ్రాములు, లేదా 0.3 మి.లీ. క్లోరాట్రానిలిపోల్ 18.5ఎస్‌పీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కాండం కుళ్లు తెగులు :
వరి పంటలో కాండం కుళ్లు తెగులు నివారణకు 2 మి.లీ. హెక్సాకోనాజోల్ లేదా 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 మి.లీ. టేబుకోనాజోల్ 15 రోజులు వ్యవధిలో రెండు సార్లు పలకల కింద వరకు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి.
ఆకు ముడత తెగులు :
వరిలో ఆకు ముడత తెగులు నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఉల్లికోడు తెగులు :
ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంటకు ఉల్లికోడు తెగులు ఎక్కువగా ఆశిస్తున్నందున దీని నివారణకు నాటిన 10 నుంచి 15 రోజుల లోపు కార్బోఫ్యూన్ గులికలు ఎకరాకు 10 కిలోలు లేదా ఫోరేట్ గులికలు 5 కిలోలు ఎకరాకు లేదా ఫిప్రోనిల్ 2.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

వరిలో చీడపీడలు.. నివారణ

వరిలో చీడపీడలు.. నివారణ