
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో గోల్‌మాల్
మేళ్లచెరువు: తనకు అందాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ బ్యాంకులో వేసి డబ్బులు తీసుకున్నాడని లబ్ధిదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం ఎస్‌ఐ పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన మద్ద వెంకటేశ్వర్లు పక్షవాతం వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొంది సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా రూ.2.50లక్షలకు చెక్కు మంజూరైంది. అయితే గతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన వెంకట్ ఆ చెక్కును కోదాడలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో వేసి తనకు తెలియకుండా డబ్బులు డ్రా చేశాడని బాధితుడు వెంకటేశ్వర్లు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నీటి గుంతలో పడి
వ్యక్తి మృతి
భువనగిరి: నీటి గుంతలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరి పట్టణ శివారులో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని పెద్దవాడకు చెందిన కడారి రమేష్(53) ఆదివారం తన కుమారుడితో కలిసి స్థానికంగా ఓ ఫంక్షన్‌హాల్‌లో ఫంక్షన్‌కు హాజరయ్యాడు. అదేరోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటికి వెళ్లే సమయానికి రమేష్ కనిపించకపోవడంతో అతడి కుమారుడు ఒక్కడే ఇంటికి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి వరకు కూడా రమేష్ ఇంటికి రాకపోవడంతో అతడికి ఫోన్ చేయగా.. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్కేసర్‌లో ఉన్నట్లు చెప్పాడు. అనంతరం అతడి ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. కాగా.. మంగళవారం ఉదయం భువనగిరి పట్టణ శివారులోని దీప్తి హోటల్ సమీపంలో వరంగల్–హైదరాబాద్‌జాతీయ రహదారి పక్కన ఉన్న నీటి గుంతలో ఓ వ్యక్తి మృతిచెందినట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్న రమేష్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతిచెందింది రమేషే అని గుర్తించారు. సమచారం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. తన తండ్రి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతిచెంది ఉండవచ్చని రమేష్ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.
నాలుగు గేట్ల ద్వారా
మూసీ నీటి విడుదల
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్‌కు 9,152 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్టు గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి 7,994 క్యూసెక్కుల దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా 643.50 వద్ద నిలకడగా ఉంచి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మూసీ కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 191 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.06 టీఎంసీల నీరు న్విల ఉందని అధికారులు తెలిపారు.