
ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 5,91,456 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 26 క్రస్ట్ గేట్ల ద్వారా 5,41,516 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదనతో 33,333 క్యూసెక్కులు మొత్తం 5,74849 క్యూసెక్కుల నీటిని దిగువన కృష్ణ నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి కాలువ, ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ కాల్వలకు 16,607 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
కృష్ణా, మూసీ సంగమం వద్ద ఉగ్రరూపం..
మిర్యాలగూడ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో టెయిల్‌పాండ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది పొంగుపొర్లుతుండగా గేట్లు ఎత్తారు. దీంతో దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా, మూసీ నదులు కలిసే సంగమం వద్దకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో శ్రీమీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఏర్పాటు చేసిన ఘాట్లతో పాటు విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి.
మట్టపల్లి క్షేత్రం వద్ద..
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నది సోమవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో పాటు మూసీ నది నుంచి వచ్చే వరద నీరు, హాలియా తదితర వాగుల నుంచి వచ్చే వరద నీటితో మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాకుండా పులిచింతల ప్రాజెక్టులో సుమారు 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ పైనుండి వస్తున్న వరద నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మట్టపల్లి వరకు నిల్వ ఉంటూ నిండుకుండను తలపిస్తోంది. ఈ దృశ్యం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే వారిని ఆకట్టుకుంటోంది.
నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తి
దిగువకు నీటి విడుదల
వాడపల్లిలో కృష్ణా, మూసీ సంగమం
వద్ద నీట మునిగిన పుష్కర ఘాట్లు

ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ

ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ