ఉరేసుకుని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని ఆత్మహత్య

Sep 24 2025 7:47 AM | Updated on Sep 24 2025 7:49 AM

భూదాన్‌పోచంపల్లి: ఇంట్లో చీరతో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం జరిగింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన రామసాని అనిల్‌రెడ్డికి చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన అక్షయ(32)తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్షయ హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంది. మంగళవారం ఉదయం అక్షయ తనకు తలనొప్పిగా ఉందని, బయట టీ స్టాల్‌ నుంచి టీ తీసుకురమ్మని భర్తకు చెప్పి పంపించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అక్షయ బెడ్‌రూంలో వెంటిలేటర్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటికి వచ్చేసరికి అక్షయ ఉరికి వేలాడుతూ కనిపించడంతో చుట్టుపక్కల వారికి విషయం చెప్పాడు. వారు వచ్చి అక్షయను కిందికి దింపి చూడగా అప్పటికే మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త అనిల్‌రెడ్డిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పిసాటి సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె. భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే భార్యాభర్తల మధ్య గత ఆరు నెలలుగా కలహాలు మొదలయ్యాయని, ఈ క్రమంలోనే భర్త అనిల్‌రెడ్డే అక్షయను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె తరఫు బంధువులు ఆరోపించారు. కాగా ఇరుపక్షాల పెద్దమనుషులు కూర్చొని మృతురాలి ఇద్దరు పిల్లల పేరిట రూ.5లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడంతో పాటు స్థిరాస్తినంతా పిల్లలకు రాసిచ్చేలా ఒప్పందం చేసుకున్నారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement