
నీరు పారదు.. పంట తడవదు
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న సాగునీటి కాలువలు కంప చెట్లు, గురప్రు డెక్క, చెత్త చెదారంతో నిండిపోతున్నాయి. కృష్ణా ఎగువ భాగంలో వర్షాలు పడుతుండటంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు రోజుకు 1.20 లక్షల క్యూసెక్కుల చొప్పున నీరు వస్తోంది. ఈనెల 28న నాగార్జునసాగర్ గేట్లు తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాగర్ కాలువలతోపాటు ఏఎంఆర్‌పీ ప్రధాన కాలువలు అక్కడక్కడ దెబ్బతినగా, డిస్ట్రిబ్యూటరీల పరిస్థితి అధ్వానంగా మారడంతో చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి ప్రతినిధి, నల్లగొండ
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ ఎడమకాల్వ పరిధిలో మొత్తం 54 మేజర్లు ఉండగా నల్లగొండ జిల్లాలో 30, సూర్యాపేట జిల్ల్లాలో 24 మేజర్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మేజర్ల కింద 98,030 ఎకరాలు, 31 ఎత్తిపోతల పథకాల కింద 47,690 ఎకరాల సాగు భూమి ఉంది. సూర్యాపేట జిల్లాలో మేజర్లు ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 2.35లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నల్లగొండ జిల్లాలో రాజవరం, సూరేపల్లి, నారెళ్లగూడ, ముదిమాణిక్యం, వజీరాబాద్, కిష్టాపురం, ముల్కలకాల్వ మేజర్లతోపాటు సూర్యాపేట జిల్లాలోని మేజర్లు, మైనర్ కాలువలు దెబ్బతినడంతో సామర్థ్యం మేరకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు.
భారీ వర్షాల కంటే ముందుగానే కాలువల మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి నెలకొంది.
వేములపల్లిలో అధ్వానంగా కాలువలు
వేములపల్లి మండల పరిధిలోని ఎల్–18, 19 పరిధిలోని కాలువల పరిస్థితి అధ్వానంగా మారింది. కాలువలలో చెత్తా చెదారం పేరుకుపోవడంతో కాలువ చివరి భూముల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. కాలువలో పెరిగిన చెట్లను చూస్తుంటే చిట్టడవిని తలపించేలా తయారయ్యాయి. వీటి కింద 3863 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, కాలువలు దెబ్బతినడంతో దాదాపు 800 ఎకరాల చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది.
అస్తవ్యస్తంగా మైనర్ కాల్వలు
చిలుకూరు మండలంలోని ముక్త్యాల బ్రాంచి కెనాల్‌కు అనుబంధంగా ఉన్న రెడ్లకుంట మేజరు పరిధిలోని మైనరు కాల్వలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఆర్లెగూడెం, రామచంద్రానగర్, కొండాపురం, రామాపురం, చిలుకూరు, సీతారామాపురం గ్రామాల పరిధిలోని 5 –ఆర్ నుంచి 10– ఆర్ వరకు ఉన్న మైనర్ కాలువలు, ఎల్–2, ఎల్–3 మైనర్ కాల్వలు అస్తవ్యస్తంగా మారాయి.
మేజర్, మైనర్ కాలువల్లో కంపచెట్లు
హుజూర్‌నగర్ పరిధిలోని లింగగిరి మేజర్, బూరుగడ్డ మైనర్ కాలువలో పిచ్చి మొక్కలు, కంపచెట్లు బాగా పెరిగాయి. అక్కడక్కడ రాళ్లు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల కాలువ కట్టను కొందరు ధ్వంసం చేశారు. మఠంపల్లి మండలం మట్టపల్లి మేజర్ ఎడమ కాలువకు అనుసంధానమైన ముత్యాల మేజర్ నుంచి సాగునీరు వేసంగి వానాకాలం సీజన్లకు విడుదల చేస్తారు. అయితే మండలంలోని బక్కమంతుల గూడెం నుంచి లాలితండా వరకు సుమారు పది కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ మేజర్ కాలువలో కంప చెట్లు దట్టంగా పెరిగి సాగునీరు చివరి వరకు చేరని దుస్థితి ఏర్పడింది. నేరేడుచర్ల మండలంలోని జాన్‌పహాడ్, చిల్లేపల్లి మేజర్ కాలువ పరిధిలోని మైనర్ కాలువల్లో కంప చెట్లు, చెత్తా చెదారం పేరుకుపోయింది.
తిప్పర్తి మండలంలోని డిస్టిబ్యూటరీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాటినిండా కంపచెట్లు పెరిగిపోయాయి. ఇండ్లూరు సమీపంలో డిస్టిబ్యూటరీ 40, సబ్ మైనర్ ఎల్ 11 కాలువలో మధ్యలోనే తాటి చెట్లు, కంపచెట్లు మొలిచి పూర్తిగా కాలువ మూసుకుపోయింది.
మైనర్ కాలువలకు మరమ్మతులేవి?
గుర్రంపోడు మండలంలో మేజర్ కాలువలలో కంపచెట్లను ఇటీవల తొలగించారు. అయితే మైనర్ కాలువల్లో మాత్రం అలాగే ఉండిపోయాయి. గుర్రంపోడు మండల పరిధిలో 55 కిలోమీటర్ల మేరకు మేజర్ కాల్వ కంపచెట్లు, చెదారంతో పూడుకుపోయింది. ప్రధానంగా నల్లరేగడి భూములు మేజర్ కాలువలు కోతకు గురై ఆనవాళ్లు లేకుండా ఉన్నాయి. దీంతో చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది.
చెత్త, చెదారం తొలగించాలి
ఆర్–3 కాలువలో పెరుకుపోయిన చెత్త, చెదారాన్ని తొలగించాలి. ఆర్–3 కాలువ పట్టణం మీదుగా వెళ్తుండటంతో కాలువ వెంట ఉన్న ఇళ్ల వారు, దుకాణాదారులు కాలువలో పోసిన చెత్త, చెదారం నీటి ప్రవాహానికి అడ్డంగా మారి చివరి భూములకు నీరందడం లేదు.
– కసిరెడ్డి మాధవరెడ్డి,
నర్సయ్యగూడెం, నేరేడుచర్ల మండలం
అధికారులు స్పందించి బాగు చేయాలి
అధికారులు స్పందించి నాలుగైదు గ్రామాల రైతులకు సాగునీరు అందించే మేజర్, మైనర్ కాలువల్లో ఉన్న రాళ్లు కంప చెట్లను వెంటనే తొలగించాలి. రైతులకు సక్రమంగా సాగునీరు అందే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
– వట్టికూటి వెంకటేశ్వర్లు, హుజూర్‌నగర్
కంపచెట్లతో మూసుకుపోయింది
డీ 22 మేజర్ కాలువ ప్రారంభంలో, మైనర్ కాలువ అంతా కంపచెట్లతో మూసుకుపోయింది. దీంతో చివరి ఆయకట్టు నీరందని పరిస్థితి నెలకొంది. ప్రతి ఏటా పంటలు ఎండిపోతున్నాయి. కంపచెట్లు తొలగించడంతో పాటు కాలువను లోతుగా తవ్వి పూడిక తీయాలి.
– మారెడ్డి మహేందర్‌రెడ్డి,
పిట్టలగూడెం, గుర్రంపోడు మండలం
కాలువలకు మరమ్మతులు చేయాలి
మా పొలాల సమీపంలోని కాలువ మధ్యలో తాటిచెట్లు, కంపచెట్లు పెరిగాయి, వేసవిలో ఉపాధి హామీ కింద చిన్నచిన్న చెట్లు తొలగించారు. కానీ తాటి చెట్లు, ఇతర పెద్ద చెట్లు కాలువ మధ్యలోనే వదిలేశారు. వాటిని తొలగించి కాలువకు మరమ్మతులు చేయాలి.
– పోలేబోయిన శంకర్,
ఇండ్లూరు, తిప్పర్తి మడలం
ఫ చిట్టడవులను తలపిస్తున్న
సాగునీటి కాలువలు
ఫ చివరి ఆయకట్టుకు చేరని నీరు
ఫ పట్టింపులేని యంత్రాంగం
ఫ ఆయకట్టు రైతులకు తప్పనితిప్పలు

నీరు పారదు.. పంట తడవదు

నీరు పారదు.. పంట తడవదు

నీరు పారదు.. పంట తడవదు

నీరు పారదు.. పంట తడవదు

నీరు పారదు.. పంట తడవదు

నీరు పారదు.. పంట తడవదు

నీరు పారదు.. పంట తడవదు

నీరు పారదు.. పంట తడవదు