
ఖమ్మంలో దొరికిపోతామని..
సూర్యాపేటటౌన్ : సూర్యాపేటలో సంచలనం సృష్టించిన సాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఈ నెల 21న రాత్రి జరిగిన బంగారం దోపిడీ కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగుచూసాయి. ప్రధాన నిందితుడు గతంలో ఖమ్మంలో చోరీ చేసి పట్టుబడ్డాడు. ఈనేపథ్యంలో ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని గ్రహించి సూర్యాపేటలో దొంగతనానికి ఒడిగట్టేందుకు స్కెచ్ వేశాడు. చోరీ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ నరసింహ 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసింది నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాగా గుర్తించారు. ప్రత్యక్షంగా ఐదుగురు నిందితులు దొంగతనంలో పాల్గొనగా వారికి సహకరించింది మరో ఇద్దరుగా గుర్తించారు. దొంగతనంలో సహకరించిన యశోద అనే మహిళను అరెస్ట్ చేసి విచారణ చేశారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వివరాలు వెల్లడించారు. ఆదివారం సూర్యాపేట హై టెక్ బస్టాండ్ సమీపంలో పోలీసులు ఫింగర్ ప్రింట్స్ తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఖమ్మం పట్టణంలోని నాయుడుపేటకు చెందిన మేకల యశోద బ్యాగును పరిశీలించగా శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో చోరీకి గురైన కొన్ని ఆభరణాలు లభ్యమయ్యాయి. ఖమ్మం పట్టణంలో నేపాల్‌కు చెందిన ఏ6 నిందితుడైన అమర్‌బట్ గూరా్‌ఖ్‌గా పనిచేస్తుండేవాడు. ఏడాది క్రితం ఈ కేసులో ఏ1 నిందితుడైన నేపాల్‌కు చెందిన ప్రకాష్ అనిల్‌కుమార్.. ఖమ్మంలో ఉంటున్న అమర్ బట్ వద్దకు వచ్చి గూరా్‌ఖ్‌గా పనిచేస్తూ యశోద అనే మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ప్రకాష్ అనిల్‌కుమార్, అమర్‌బట్ వీరిద్దరు కలిసి ఖమ్మంలో వివిధ కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తూ దొంగతనాలకు పాల్పడుతుండేవారు. వీరికి యశోద ఆశ్రయం కల్పిస్తూ దొంగతనాలు చేయడానికి సాయం చేస్తుండేది. గతంలో ఖమ్మంలో దొంగతనాలు చేసి దొరికిపోయారు. అయితే ఈసారి ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని, సూర్యాపేట పట్టణాన్ని ఎంచుకున్నారు. ప్రకాష్ అనిల్‌కుమార్‌కు తెలిసిన మరొక వ్యక్తి అయిన నేపాల్‌కుచెందిన కడాక్ సింగ్‌తోపాటు, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో ముగ్గురిని పిలిపించుకుని చోరీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రకాష్ అనిల్‌కుమార్, అమర్‌బట్‌లకు ఆశ్రయం ఇస్తూ, ఆర్థికంగా, దొంగతనాలకు సహకరిస్తున్న మేకల యశోదతో కలిసి సూర్యాపేటకు వచ్చారు.
నేపాల్‌లో అమ్మేందుకు..
సూర్యాపేటలో దొంగలించిన బంగారం ఇక్కడ అమ్మితే అనుమానం వస్తుందని నేపాల్‌కు తీసుకెళ్లి అమ్ముదామని ఐదుగురు నిందితులు నిర్ణయించారు. ఈమేరకు వారికి ఆశ్రయం ఇచ్చి సహకరించిన అమర్ బట్, మేకల యశోద ఖర్చులకు కొన్ని బంగారు ఆభరణాలు ఇచ్చి నేపాల్‌కు పోతున్నట్లు వారికి చెప్పారు. నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు ప్రతక్ష్యంగా చోరీకి పాల్పడిన నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఐదుగురిని గుర్తించామని ఎస్పీ తెలిపారు.
రెండున్నర కిలోల బంగారం
చోరీకి గురైనట్లు ఫిర్యాదు
ఈ కేసులో మొత్తం జ్యువెలరీ షాపు యజమాని రెండున్నర కిలోల బంగారం, కొంత నగదు దొంగతనానికి గురైనట్లు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరో ఆరుగురు నిందితుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు. త్వరలో నిందితులను పట్టుకుని బంగారం రికవరీ చేస్తామని పేర్కొన్నారు. ఏ1 నిందితుడైన ప్రకాష్ అనిల్‌కుమార్‌పై గతంలో ఖమ్మం జిల్లాలో మూడు దొంగతనం కేసులో ఉన్నాయని, మిగిలిన నిందితులపై ఉన్న పాత కేసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మహిళా నిందితురాలి నుంచి 14తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ శివతేజ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో ఇంటిని అద్దెకు తీసుకొని..
సూర్యాపేటలో దొంగతనం చేయాలని పథకం ప్రకారం ఈ ఏడాది మే మొదటి వారంలో మొదట ప్రకాష్ అనిల్‌కుమార్, అమర్‌బట్, మేకల యశోదలు కలిసి సూర్యాపేట ఎంజీ రోడ్డులోని బంగారం షాపు వెనుక ప్రాంతంలో యజమాని లేని ఇంట్లో ఒక రూంను అద్దెకు తీసుకున్నారు. మే చివరి వారంలో సూర్యాపేటకు వచ్చి రెక్కీ నిర్వహించి మళ్లీ ఖమ్మం వెళ్లారు. ప్రకాశ్ అనిల్‌కుమార్, జార్ఖండ్ కు చెందిన కడక్ సింగ్‌తో పాటు మరో ముగ్గురు (జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన) వ్యక్తులతో కలిసి అదును చూసి శ్రీ సాయి సంతోషి జ్యువెలరీలో షాపులో దొంగతనానికి పాల్పడ్డారు.
ఫ సూర్యాపేటను ఎంచుకున్న దుండగులు
ఫ బంగారం దోపిడీ కేసులో
మహిళ అరెస్టు