
ఇద్దరు దొంగలు అరెస్ట్
భువనగిరిటౌన్ : వరస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని భువనగిరి పట్టణ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన బడ్డుల అనిల్, స్వాతి భార్యాభర్తలు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు అలవాటు పడ్డారు. ఇప్పటికే వీరిపై ఐదు పోలీస్ స్టేషన్‌లలో పలు చోరీ కేసులు ఉన్నాయి. ఓ కేసులో అరెస్ట్ అయి 11 నెలల అనంతరం ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నెల 18న భువనగిరి పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో, 24న అదే కాలనీలో మూడు ఇళ్లలో చోరీ చేసి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భువనగిరి పట్టణంలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. చోరీలకు పాల్పడుతుంది వీరేనని తేలింది. ఇప్పటి వరకు దొంగతనం చేసిన నగదు, బంగారు ఆభరణాలు రికవరీ కాలేదని పోలీసులు తెలిపారు. సమగ్ర విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.