
‘స్థానిక’ స్థానాలు ఖరారు
జిల్లాలో 178 ఎంపీటీసీలు.. 17 జెడ్పీటీసీలు
ప్రధాన పార్టీలకు సవాల్‌గా..
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు సవాల్‌గా మారునున్నాయి. పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ద్విముఖ పోటీ ఉండనుండగా, కొన్నిచోట్ల బీజేపీతో త్రిముఖపోటీ ఉండనుంది. జిల్లాలో వామపక్షాలు, ఎంఎల్ పార్టీలు కూడా స్థానిక పోరులో కీలకంగా కానున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుపొందేందుకు పావులు కదుపుతుండగా ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి స్థానిక పోరులో పట్టు సాధించాలని చూస్తున్నాయి.
సాక్షి, యాదాద్రి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల వారీగా స్థానాలను ఖరారు చేసి జాబితాలను వెల్లడించింది. దీంతోపాటు స్థానిక పోరుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు సైతం అందాయి.
ఇక.. స్థానిక సమరమే..
స్థానిక సంస్థల స్థానాలు ఖరారు కావడంతో ఇక గ్రామాల్లో ఎన్నికల సమర భేరీ మోగనుంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అఽధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు కావాల్సిన మెటీరియల్, అధికారులు, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో, డీపీవోలు, పోలీస్‌శాఖకు ఆదేశాలు అందాయి.
గతంలో కంటే ఒక ఎంపీటీసీ స్థానం అదనం
జిల్లాలో గతంలో కంట ఒక ఎంపీటీసీ స్థానం పెరిగింది. 17 మండలాల్లో ఇప్పటి వరకు 177 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ప్రతి మండలంలో ఐద ఎంపీటీసీ స్థానాలు ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఒక ఎంపీటీసీ స్థానం పెరిగింది. దీంతో మోత్కూరు మండలం పాటిమట్ల ఎంపీటీసీ స్థానం పెరిగింది. దీంతో ఆ మండలంలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య నాలుగు నుంచి ఐదుకు చేరింది. ఫలితంగా జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్య 177 నుంచి 178కి చేరాయి. ఒక జెడీ చైర్మన్, 17 చొప్పున ఎంపీపీలు, జెడ్పీటీసీ స్థానాలు ఖరారు అయ్యాయి. వీటితోపాటు 427 గ్రామ పంచాయతీలు, 3,704 వార్డులు ఖరారు అయ్యాయి.
ఆర్డినెన్స్‌పై ఉత్కంఠ!
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అర్డినెన్స్ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ ఆమోదిస్తారా.. లేక తిప్పిపంపుతారా అన్న చర్చ సాగుతోంది. ఒక వేళ గవర్నర్ ఆమోదిస్తే దాని ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు కానున్నట్టు తెలుస్తోంది.
ఫ 17 ఎంపీపీ, 427 గ్రామ పంచాయతీలు
ఫ కొత్తగా పాటిమట్ల ఎంపీటీసీ స్థానం
ఫ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
ఫ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు