ఆడిట్ ఏం చేస్తున్నారు?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల మెడపై పెన్షన్ కత్తి వేలాడుతోంది. తమకు సంబంధం లేకపోయినా కేవలం పెన్షన్ పంపిణీ తమ చేతులు మీదుగా జరగడం, మిగిలిన సొమ్ము సీఎఫ్‌ఎంఎస్‌లో సక్రమంగా ఎవరు జమ చేయకపోయినా చివరికి సచివాలయ సిబ్బంది ఖాతాలో పడుతుంది. ఈ తరహాలో ఒక్క ఏలూరు జిల్లాలో 214 మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు రూ.68.18 లక్షలు చెల్లించాలని మెమోలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో పెన్షన్ పంపిణీకి సంబంధించి చెక్ పవర్ పంచాయతీ కార్యదర్శికి, నగరాలు, పట్టణాల్లో వార్డు అడ్మిన్లకు ఉంటుంది. సంబంధం లేని అసిస్టెంట్లకు మెమోలు జారీ చేయడం కలకలం రేపింది.
తీవ్ర విమర్శలు
ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మిగిలిన సొమ్ము ప్రభుత్వ ఖాతాకు జమ చేయలేదనే కారణంతో 214 మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు డీఆర్‌డీఏ పీడీ మెమోలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,503 మంది సిబ్బందికి రూ.42.54 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు (5 ఏళ్లు) బకాయిలు మూడు రోజుల్లో చెల్లించాలని హడావుడి మొదలుపెట్టడం తీవ్ర విమర్శలకు రేగుతున్నాయి. వాస్తవానికి జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి చెక్ పవర్ ఉంటుంది ప్రతి నెలా పెన్షన్లు ఎంత మందికి ఎంత మొత్తం ఆ గ్రామంలో మంజూరయ్యాయో ముందుగా వివరాలు ఇచ్చి ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. చెక్ పవర్ ఉన్న పంచాయతీ కార్యదర్శి నగదును విత్‌డ్రా చేసి వెల్ఫేర్ అసిస్టెంట్‌కు ఇవ్వడం, వెల్ఫేర్ అసిస్టెంట్ పెన్షన్లు పంపిణీ చేసి 3వ తేదీలోపు పెన్షన్ ఎవరైనా తీసుకోకపోతే మిగిలిన మొత్తాన్ని సీఎఫ్‌ఎంఎస్ ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. సదరు వెల్ఫేర్ అడ్మిన్ ఎంత మొత్తం పంపిణీ చేసింది, ఎంత నగదు నిల్వ ఉంది, ఏ తేదీన తిరిగి చెల్లించిందో అన్ని వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఆన్‌లైన్‌లో ప్రతినెలా వెల్ఫేర్ అసిస్టెంట్ ఖాతా మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక జీరోగా కనిపిస్తుంది. ఈ క్రమంలో 5వ తేదీలోపు చెల్లించకపోతే డీఆర్‌డీఏ అధికారులు 10వ తేదీలోపు పూర్తి కాకపోతే ఎంపీడీఓల నుంచి ఫోన్లు, హడావుడి ఉంటుంది. మరోవైపు సకాలంలో జమ చేయకపోతే రోజుకు రూ.100 లేదా 18 శాతం వడ్డీ వెల్ఫేర్ అసిస్టెంట్లు చెల్లించాలి. దీంతో పాటు ఏటా ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తుంది. ఆడిట్‌లో లోపాలు, అవకతవకలు ఉంటే వెంటనే బాధ్యులకు మెమోలు జారీ చేసి జీతంలో రికవరీతో సహా అన్ని చర్యలు తీసుకుంటారు. ఇంత పకడ్బందీ వ్యవస్థతో పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అయితే ఏటా ఆడిట్ జరిగినా కూడా 2020–21 నుంచి బాకీలంటూ జిల్లా అధికారులు మెమోలు ఇవ్వడం కక్ష సాధింపేనని వెల్ఫేర్ అసిస్టెంట్లు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి 214 మంది సచివాలయ సిబ్బంది రూ.68,18,525లు చెల్లించాల్సి ఉందని నోటీసులో పేర్కొన్నారు.
నిజంగానే 2020 నుంచి బకాయిలుంటే ఏటా డీఆర్‌డీఏ ద్వారా జరిగే వార్షిక ఆడిట్‌లో ఎందుకు వెలుగులోకి రాలేదు. సహజంగా పెన్షన్లు మిగిలితే సీఎఫ్‌ఎంఎస్‌లో జమ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కట్టిన పేమెంట్ ఫెయిల్ అయితే మళ్లీ చెల్లిస్తే ఒక రశీదు వచ్చి మరో రశీదు పెండింగ్‌లో ఉంటుంది. అలాంటి వాటికి లిఖితపూర్వకంగా కార్యాలయంలో వివరాలు ఇస్తూ ఉంటారు. ఇంకో వైపు వెల్ఫేర్ అసిస్టెంట్లు 2020–21 నుంచి ఇప్పటివరకు బదిలీలు జరగడంతో అనేక మంది స్థానచలనమయ్యారు. అలాగే ఎంపీడీఓలు పూర్తి విచక్షణతో ప్రభుత్వ అనుమతితో పెన్షన్ సొమ్మును గతంలో అత్యవసర కార్యక్రమాలకు వినియోగించిన దాఖలు జిల్లాలో ఉన్నాయి. ఉదాహరణకు జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో కరోనా సమయంలో ప్రతి రేషన్‌కార్డు దారుడికి రూ.1,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయం కింద గ్రామంలో రూ.20 వేలు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేశారు. దానికి సంబంధించి ఈ రోజుకు కూడా డీఆర్‌డీఏ నుంచి ఆ గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్‌కు మెమోలు అందుతూనే ఉన్నాయి. పలుమార్లు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినా మెమోలు వస్తుండటం గమనార్హం.
వెల్ఫేర్ అసిస్టెంట్లపై పెన్షన్ కత్తి
ఏలూరు జిల్లాలో 214 మందికి మెమోలు
2021 నుంచి బకాయిలంటూ ప్రభుత్వం హడావుడి
జిల్లాలో రూ.68.18 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు
మూడు రోజుల్లోపు జమ చేయాలని హుకుం


