66 శాతం ఉత్తీర్ణత
భీమవరం : వేసవి సెలవులు ముగియనున్నాయి. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియెట్ తదితర కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏ గ్రూపులో చేరాలి, ఏ కోర్సు తీసుకుంటే భవిష్యత్ బాగుంటుందనే సందిగ్ధంలో చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. ఇదిలా ఉండగా జేఈఈ, నీట్ అంటూ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఉన్నత విద్యకు వారధిలా ఇంటర్మీడియెట్ నిలుస్తుందనడంలో సందేహం లేదు.
15 ప్రభుత్వ కాలేజీలు
జిల్లాలో 15 ప్రభుత్వ, రెండు ఎయిడెడ్, రెండు సోషల్ వెల్ఫేర్, 82 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో ఎంపీసీ బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి.
● ఎంీపీసీ : ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. ఇంజినీరింగ్‌లో స్థిరపడాలనుకునేవారు ఎంపీసీ తీసుకోవచ్చు. జేఈఈ, ఏపీఈఏపీసెట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఐఐటీ, నిట్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు.
● బైపీసీ : ప్రధానంగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉంటాయి. నీట్, ఏపీఈఏపీ సెట్ పరీక్షల ద్వారా డాక్టర్, వైద్య సంబంధిత వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు. అలాగే అగ్రికల్చర్ కోర్సుల్లో చేరవచ్చు.
● ఎంఈసీ/సీఈసీ : ప్రధానం మ్యాథ్స్, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. చార్టెడ్ ఎకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కమర్షియల్ ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగాలకు ఈ కోర్సు ఉపకరిస్తుంది.
● ఐటీఐలు : పదో తరగతి తర్వాత ఐటీఐ కోర్సులను ఎంచుకోవడం ద్వారా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించవచ్చు. ఎలక్ట్రికల్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్ తదితర కోర్సులు ఉంటాయి.
● పాలిటెక్నిక్ : పాలిటెక్నిక్ కోర్సుల ద్వారా సాంకేతిక విద్యలో రాణించవచ్చు. సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్, కెమికల్ తదితర కో ర్సులు ఉన్నాయి. పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత ఉద్యోగాలు పొందవచ్చు. అలాగే లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించవచ్చు.
జిల్లాలో 101 జూనియర్ కాలేజీలు
ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో వసతుల కల్పనతోపాటు విద్యాబోధన మెరుగుపడింది. ప్రభుత్వ కళాశాలల్లో ఫీజులు తక్కువ ఉండడంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గడిచిన విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌లో 49 శాతం, సెకండియర్‌లో 66 శాతం ఉత్తీర్ణత సాధించారు.
–జి.ప్రభాకరరావు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి, భీమవరం


