మంచినీటి సమస్య లేదు
వారం రోజులుగా నీటి ఎద్దడి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సూరప్పగూడెం పంచాయతీ పాతూరులో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. గ్రామానికి ప్రధాన ఆధారంగా ఉన్న మంచినీటి చెరువు అడుగంటడంతో గ్రామస్తులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో నాలుగైదు రోజుల్లో చెరువు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. గ్రామ, మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మునుపెన్నడూ లేని విధంగా నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తోందని గ్రామస్తులు అంటున్నారు. రెండు దశాబ్దాలుగా తాగునీటి కష్టాలు అంటే ఏంటో తెలియదని.. కానీ ప్రస్తుత కూటమి పాలనలో దాహం కేకలు వినిపిస్తున్నాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. గ్రామంలో సరైన బోరు లేకపోవడంతో, చెరువులోని అడుగంటిన నీటిని చేదులు తీసి, ఒకచోటకు చేరిన నీటిని మోటార్లతో తోడి, ఆ నీటినే ఫిల్టర్ చేసి గ్రామస్తులకు సరఫరా చేస్తున్నారు. దుర్వాసన కొడుతున్న ఈ నీరు బట్టలు ఉతుకేందుకు తప్ప తాగడానికి ఎంతమాత్రం పనికిరావని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నీటిని తాగితే అనారోగ్యం పాలుకావడం ఖాయమని వాపోతున్నారు. దీనితో కొందరైతే సొంత డబ్బులతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ఇళ్లలో జరిగే చిన్న చిన్న శుభకార్యాలకు సైతం నీరు లేక ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. పశువులు తాగేందుకు కూడా నీరు లేకపోవడంతో, ట్యాంకర్లతో తెచ్చుకున్న నీటిని తొట్టెల్లో పోస్తూ వాటి ప్రాణాలను కాపాడుకుంటున్నారు.
ముందస్తు ప్రణాళికలేవీ?
గత నెల 20న గోదావరి కాల్వను మూసివేసిన క్రమంలో చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం, జలవనరుల శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో చెరువులను పూర్తి స్థాయిలో నింపలేదు. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండటంతో నీరు ఆవిరైపోవడం కూడా మరో కారణమని అధికారులు చెబుతున్నారు. దీనితో నెల రోజులు గడవక ముందే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. గ్రామంలోని సమస్యలపై పూర్తి అవగాహన లేని వారు అధికారులపై ఆధిపత్యం చలాయించి ప్రధాన సమస్యలను పక్కన పడేయడంతో పాలన పడకేసింది.
రూ.40 లక్షలతో మైక్రో ఫిల్టర్
వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామంలోని రెండు వేల మంది జనాభాకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే గ్రామస్తుల అభ్యర్థనపై, అప్పటి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జలజీవన్ మిషన్‌లో రూ.40 లక్షల మంజూరు చేయించారు. దీనితో గ్రామంలో మైక్రో వాటర్ ఫిల్టర్‌తో పాటు పైపులైన్ల నిర్మాణం చేపట్టారు. దీనివల్ల గ్రామస్తులు గతంలో తాగునీటి సమస్యను ఎన్నడూ ఎదుర్కోలేదు. అయితే ప్రస్తుత ప్రత్యేక అధికారుల పాలనలో ఇలాంటి ప్రధాన సమస్యలను గాలికొదిలేశారు. పంచాయతీలు సైతం అత్యవసర పనులు చేసేందుకు నిధులు లేకపోవడంతో మౌనం వహించి చేతులెత్తేస్తున్నాయి.
ఎండిపోయిన మంచినీటి చెరువు
ఇప్పటికే మంచినీటి చెరువులోని నీటిని ఫిల్టర్ చేసి గ్రామస్తులకు సరఫరా చేస్తున్నాం. గ్రామంలోని ప్రజలకు తాగునీరు అందించేందుకు అవసరమైన ట్యాంకర్లను ఏర్పాటు చేస్తాం. గోదావరి కాల్వకు తిరిగి నీటిని విడుదల చేసే వరకు చెరువులోని నీరు తాగునీటి అవసరాలను తీరుస్తుంది. అయినప్పటికీ గ్రామంలో అత్యవసర పనుల్లో భాగంగా కొత్త బోరు ఏర్పాటుకు తవ్వకం పనులు ప్రారంభించాం. నాలుగైదు రోజుల్లో బోరు సిద్ధమవుతుంది.
– బాలామణి, పంచాయతీ అభివృద్ధి అధికారి, సూరప్పగూడెం
పాతూరు గ్రామంలో వారం రోజులుగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. గత్యంతరం లేక ఎవరికి వారు సొంత ఖర్చులతో ట్యాంకర్లతో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత 20 ఏళ్లుగా గ్రామంలో మంచినీటి సమస్య రాలేదు. పంచాయతీ పాలకవర్గం ఉన్నంత వరకు సమస్య రాకుండా చూశారు. ప్రత్యేకాధికారుల పాలన, పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం, అవగాహన లేమి వల్లే చెరువును పూర్తి స్థాయిలో నింపలేదు. నెల రోజులకే చెరువు ఎండిపోయింది.
– వెజ్జు అప్పారావు, గ్రామస్తుడు, పాతూరు


