జోరుగా మట్టి అక్రమ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

జోరుగా మట్టి అక్రమ తవ్వకాలు

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

చింతలపూడి: చింతలపూడి మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, సహజ వనరులను నిలువునా దోచేస్తున్నారు. మండల పరిధిలోని వెలగలపల్లి గ్రామ పరిధిలో ఉన్న మర్రికుంట చెరువు, ఉర్లగూడెం గ్రామ పరిధిలోని రాళ్ల చెరువుల్లో గత కొన్ని రోజులుగా అక్రమ మట్టి తోలకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాత్రింబవళ్లు తేడా లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంతో ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయల గండి పడుతుండగా, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల కనుసన్నల్లోనే మట్టి భాగోతం

ఈ అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, జేసీబీలతో చెరువులను తవ్వేస్తూ మట్టిని తరలిస్తున్నా.. మైనింగ్‌, రెవెన్యూ, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు చేసినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ పోలీసు అధికారులు పట్టుకున్నా పై స్ధాయిలో ఒత్తిడి తీసుకు వచ్చి కేసులు లేకుండా బయట పడుతున్నారని సమాచారం. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, రాయల్టీ చెల్లించకుండా సాగుతున్న ఈ దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. కొందరు అధికార పార్టీ నేతలు అధికారులను మేనేజ్‌ చేస్తూ లక్షల రూపాయల విలువైన మట్టిని సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పర్యావరణానికి తీవ్ర ముప్పు

చెరువుల్లో ఇష్టానుసారంగా జేసీబీలతో లోతుగా తవ్వేయడం వల్ల భూగర్భ జలాల మట్టం పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో చెరువుల కట్టలు బలహీనపడి, గ్రామాల్లోకి నీరు వచ్చే ప్రమాదం పొంచి ఉందంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మట్టి లోడుతో గ్రామాల్లోని అంతర్గత రహదారులపై నిత్యం తిరుగుతున్న భారీ ట్రాక్టర్ల వల్ల రోడ్లన్నీ ధ్వంసమై గుంతలమయంగా మారుతున్నాయి.

ఇప్పటికై నా స్పందించేనా?

ఈ మట్టి దోపిడీపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని చింతలపూడి మండల ప్రజలు, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వెలగలపల్లి, ఉర్లగూడెం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చింతలపూడి మండలంలో రెచ్చిపోతున్న

మట్టి మాఫియా

Advertisement
 
Advertisement
Advertisement