ఏలూరు టౌన్: మాదక ద్రవ్యాల నిర్మూలన ధ్యేయంగా ఏలూరు నగరంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని.. ముఖ్యంగా యువత మత్తుపదార్థాలకు బానిసగా మారకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు అన్నారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో ఈగల్ టీమ్, త్రీటౌన్ పోలీస్, డాగ్ స్క్వాడ్ సంయుక్తంగా ఏలూరు ఆర్‌టీసీ బస్టాండ్‌లో తనికీలు చేపట్టారు. కొత్త బస్టాండ్‌లో ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేశారు. అనంతరం ప్రయాణికులకు డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలను, సమాజానికి ఏవిధంగా చేటు చేస్తుందనే విషయాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే 1972 హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీపీటీవో ఎస్‌కే షబ్నం, ఈగల్ ఆర్‌ఎస్‌ఐ బీ.ఉదయ్‌భాస్కర్, నషాముక్తి భారత్ అభియాన్ ఇన్‌ఛార్జ్ రామ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.


