ఆక్వా రైతుల ఆక్రందన | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతుల ఆక్రందన

May 27 2026 10:20 AM | Updated on May 27 2026 10:20 AM

సబ్సిడీ విద్యుత్‌ ఇవ్వాలి

ఆక్వా సంక్షోభాన్ని నివారించాలి

సబ్సిడీ విద్యుత్‌ ఉత్తుత్తి మాటలేనా?

తగ్గని ఫీడ్‌, సీడ్‌ ధరలు

పెరగని రొయ్య ధర

సబ్సిడీ విద్యుత్‌ హామీ అమలు శూన్యం

భీమవరం: దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ఆక్వా రైతుల ఆక్రందన అరణ్య రోదనగానే మిగులుతోంది. రొయ్యల మేత (ఫీడ్‌) ధరలు తగ్గించాలని, నాణ్యమైన సీడ్‌ అందించాలని, ధరల పతనాన్ని అరికట్టాలని, సబ్సిడీ విద్యుత్‌ ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు పోరుబాట పట్టినా ఫలితం కనిపించడం లేదు. జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా, అందులో సుమారు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో సాగు దీనికంటే ఎక్కువే ఉంటుందని అంచనా. ఒకప్పుడు రొయ్యల సాగుతో లాభాలు గడించిన రైతులు, నేడు మార్కెట్‌ ఒడిదుడుకులతో కుదేలవుతున్నారు.

ఆందోళనల్లో కూటమి నాయకులే అధికం

విశేషమేమిటంటే, ఈ రొయ్యల రైతుల ఆందోళనలకు కూటమి పార్టీల నాయకులే నాయకత్వం వహిస్తున్నారు. పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో టీడీపీ నాయకుడు, మంత్రి నిమ్మల రామానాయుడి అనుచరుడు గొట్టుముక్కుల గాంధీ భగవాన్‌ రాజు, భీమవరం ప్రాంతంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఈ నిరసనల్లో ముందున్నారు. ఫీడ్‌ బస్తాలు తగులబెట్టడం, విద్యుత్‌ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భీమవరంలో కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆక్వా రైతులు, ఫీడ్‌ మిల్లుల యజమానులు, ఎక్స్‌పోర్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎక్స్‌పోర్టర్లు అంతంతమాత్రంగానే రాగా, ఫీడ్‌ మిల్లుల యజమానులు ఒక్కరు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. దీని వెనుక పెద్ద లాబీయింగ్‌ జరుగుతోందని రైతులు అనుమానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించకుంటే రైతులు ‘క్రాప్‌ హాలిడే’ ప్రకటించే ప్రమాదం ఉంది, ఇది దేశ విదేశీ మారకద్రవ్య ఆదాయాన్ని దెబ్బతీస్తుంది.

కూటమి నాయకులు ఎన్నికల హామీ ప్రకారం జోన్లతో ప్రమేయం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్‌ అందించాలి. పెరిగిన పెట్టుబడులతో ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇది కొంత ఊరట కలిగిస్తుంది. ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి.

– మళ్ల తులసీరామ్‌ , ఫ్రాన్‌ ఫార్మర్స్‌

వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఒకపక్క ఫీడ్‌, సీడ్‌ ధరలు పెరిగి, మరోపక్క రొయ్యల ధరలు పతనం కావడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ఈ సమస్యలను పరిష్కరించాలి.

– గాదిరాజు వెంకటసుబ్బరాజు, ఫ్రాన్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి

గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కే అందించడమే కాకుండా, కోవిడ్‌ సమయంలో రొయ్యల ధరలు పడిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫీడ్‌ ధరలు ఇష్టమొచ్చినట్లు పెంచకుండా ఉత్పత్తిదారులతో కట్టుదిట్టమైన సమీక్షలు నిర్వహించింది. అప్సడాను ఏర్పాటు చేసి నిత్యం రైతులకు అండగా నిలిచింది. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తాము అధికారంలోకి రాగానే ఆక్వా జోన్లతో ప్రమేయం లేకుండా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఆ హామీ అమలు కాలేదు. పైగా ఫీడ్‌, సీడ్‌ ధరలు పెరిగి, రొయ్యల ధరలు తగ్గడంతో రైతులు రోడ్డున పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement