వైద్యం.. అపహాస్యం | - | Sakshi
Sakshi News home page

వైద్యం.. అపహాస్యం

May 27 2026 12:53 AM | Updated on May 27 2026 12:53 AM

తణుకు అర్బన్‌: జిల్లాలో వైద్యం.. అపహాస్యంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోయినా, కొన్నిరకాల ధృవపత్రాలు సక్రమంగా లేకపోయినా వారికి అనుమతులు ఇవ్వడంలో వైద్యారోగ్య శాఖ రాజకీయ సిఫార్సులు, ఇతర వ్యవహారాలకు తలొగ్గి పూర్తిస్థాయిలో పరిశీలన లేకుండానే అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైఫలంపై విమర్శలు

ఈనెల 16న తణుకులో బీహార్‌కు చెందిన రింకూ కుమారి అనే గర్భిణిని ఒక ఆర్‌ఎంపీ వైద్యుడు పైడిపర్రులోని స్టార్‌ హాస్పిటల్‌లో చేర్చగా ఊరు, పేరుతోపాటు కేస్‌ హిస్టరీ తెలియకుండానే శస్త్రచికిత్స చేయడం.. కొద్ది గంటల్లోనే ఆడశిశువుకు జన్మనిచ్చి బాలింత మృతి చెందింది. మూడేళ్లుగా అనుమతులు లేని ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయంటే వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుందనేది ప్రశ్నగా మిగులుతోంది. పైగా వైద్యం వికటించి బాలింత చనిపోతే వారం రోజులకు కానీ వైద్య ఆరోగ్య శాఖ స్పందిచకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గతనెల 28న ఉండ్రాజవరానికి చెందిన గర్భిణి మానుకొండ ప్రవల్లిక రెండు చెవులు లేని ఆడ శిశువుకు జన్మనిచ్చింది. సదరు గర్భిణి 22వ వారంలో తణుకు వేవ్‌ స్కానింగ్‌ సెంటర్‌లో టిఫా స్కానింగ్‌ చేయించుకోగా అన్ని అవయవాలు బాగానే ఉన్నట్లుగా రిపోర్టు ఇచ్చింది. స్కానింగ్‌ సెంటర్‌ వైఫల్యంపై వివరణ కోరగా టిఫా స్కానింగ్‌లో చెవులు ప్రొటోకాల్‌ కాదని తణుకు వేవ్‌ స్కానింగ్‌ సెంటర్‌ రేడియాలజిస్ట్‌ వైద్య ఆరోగ్య శాఖకు సంజాయిషీ ఇవ్వడం, అదే నివేదికను సమర్థిస్తూ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జి.గీతాబాయ్‌ సైతం పత్రికా ప్రకటనగా ఇస్తూ సమర్థించుకోవడం సైతం పలు విమర్శలకు తావిస్తోంది.

ప్రైవేటు వైద్యశాలలో అనుమతి లేకుండా ప్రసవాలు

బాలింత మృతి జరిగిన వారం రోజులకు విచారణ

రెండు చెవులు లేకుండా బిడ్డ జన్మించినా పట్టని వైనం

స్కానింగ్‌ సెంటర్ల నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement