ప్రభుత్వ భూమికి వీడిన ఆక్రమణల చెర | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమికి వీడిన ఆక్రమణల చెర

May 27 2026 12:53 AM | Updated on May 27 2026 12:53 AM

ప్రభుత్వ భూమికి వీడిన ఆక్రమణల చెర కానిస్టేబుల్‌పై కేసు నమోదు వైద్యురాలు స్రవంతికి ప్రెసిడెంట్‌ గోల్డ్‌మెడల్‌ కారు ఢీకొని ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

పాలకోడేరు: గ్రామాభివృద్ధి కమిటీ చొరవతో ప్రభుత్వ భూమిని ఆక్రమణల చెర నుంచి విడిపించారు. కోవిడ్‌కు ముందు శృంగవృక్షంలో చెత్త ఎక్కడ బడితే అక్కడే వేయడంతో గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. దీనిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో గ్రామాభివృద్ధి కమిటీ ఎఫ్‌ఎంబీ, అడంగళ్‌లు పరిశీలించి గ్రామంలో ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు. దూసనపూడి రోడ్‌లో రీ.స.నెంబర్‌.479/3లో 1.51 ఎకరాలు మడుగును ఆక్రమించుకున్నారని, అది డంపింగ్‌ యార్డుకు ఉపయోగపడుతుందని వివరిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన డైరెక్షన్‌ మేరకు మంగళవారం సచివాలయం సర్వేయర్‌ మణికంఠ రోవర్‌ సహాయంతో ఆ భూమిని కొలిచి సరిహద్దులు నిర్ణయించి సర్వే రాళ్లు పాతారు. కాగా ఎంతో విలువైన భూమిని కాపాడినందుకు గ్రామాభివృద్ధి కమిటీని గ్రామస్థులు అభినందించారు.

కుక్కునూరు:వివాహితను లైంగిక వేధింపులకు గురిచేసిన కానిస్టేబుల్‌పై మంగళవారం కేసు నమోదైంది. ఎస్సై రాజారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం, పెద్దరావిగూడెం గ్రామానికి చెందిన వివాహితను వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతూ, బ్లాక్‌ మెయిల్‌ చేశాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు.

నూజివీడు: మండలంలోని పల్లెర్లమూడికి చెందిన వైద్యురాలు ఉప్పలపాటి స్రవంతి న్యూరాలజీ విభాగంలో దేశవ్యాప్తంగా టాపర్‌గా నిలిచి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్‌ గోల్డ్‌ మెడల్‌ పురస్కారాన్ని అందుకున్నారు. 2023 సంవత్సరానికి గాను న్యూరాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమెకు ఈ గౌరవం లభించింది. ఈ అవార్డును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా ఈనెల 23న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నట్లు స్రవంతి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం స్రవంతి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమె సాధించిన ఈ ఘనత పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

నూజివీడు: కారు ఢీకొని ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి చెందిన ఘటన పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హనుమంతులగూడెంకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ యండ్రపాటి రవికుమార్‌ (37) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పుల్లల లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను తీసుకొని కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో గల ఫ్యాక్టరీ వద్ద పుల్లలను దించి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నూజివీడు బైపాస్‌ రోడ్డులో గల బృందావన్‌ గార్డెన్‌ సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి కారు ట్రాక్టర్‌ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో రవికుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. రవికుమార్‌కు భార్య వీర ధర్మవతి, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ పీ సత్య శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement