వడదెబ్బకు ఐదుగురి బలి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఐదుగురి బలి

May 27 2026 12:53 AM | Updated on May 27 2026 12:53 AM

పోలవరం రూరల్‌: జిల్లాలో వడగాలులు తట్టుకోలేక ఐదుగురు మృతి చెందారు. పోలవరం పంచాయతీ పరిధిలోని బెస్తా వీధికి చెందిన పెదమల్లు అనసూయ (85) మంగళవారం వడదెబ్బ తగిలి ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానికులు ఆమెను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతిచెందింది.

నిద్రలోనే మరణం

ఆగిరిపల్లి: అనంతసాగరంనకు చెందిన ఈసం వెంకటేశ్వరరావు (70) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. సోమవారం ఉదయం వెంకటేశ్వరరావు తన గేదెలను మేపడానికి పొలంలోకి తోలుకొని వెళ్లాడు. ఎండవేడికి వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురి అవడంతో కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందజేశారు. మంగళవారం ఉదయం వెంకటేశ్వరరావు నిద్రలోనే మరణించాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఉపాధి హామీ పనికి వెళ్లి..

కుక్కునూరు: వడదెబ్బకు గురై ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. కమ్మరిగూడెం గ్రామానికి చెందిన మిడియం ఎర్రయ్య (50) శనివారం ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

కొత్తగూడెంలో...

దెందులూరు: కొత్తగూడెంలో ఉపాధి కూలీ లంకపల్లి ఏలియా (55) మంగళవారం వడదెబ్బకు మృతి చెందాడు. ఉదయం ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ఏలియా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే దెందులూరు ప్రభుత్వాసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

చింతలపూడిలో...

చింతలపూడి: స్థానిక వైఎస్సార్‌ కాలనీకి చెందిన తోట సీతామహాలక్ష్మి (37) సోమవారం వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement