బుట్టాయగూడెం: మండలంలోని నూతిరామన్నపాలెం సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ కారు చెట్టును ఢీకొట్టింది. తాడేపల్లిగూడెంకు చెందిన కొందరు యువకులు గుబ్బల మంగమ్మగుడి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా నూతిరామన్నపాలెం సమీపంలో ఒక ఆటోను ఢీకొట్టి పక్కనే ఉన్న కొబ్బరిబొండాల కొట్టును ఢీకొట్టి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని ఆటో డ్రైవర్, కొబ్బరిబొండాల వ్యాపారులు సతీష్, భవానీ కోరుతున్నారు.
కాళ్ల: తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతి లేని పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కోల్పోవద్దని మండల విద్యాశాఖాధికారి–1 డీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాళ్ల మండలం సీసలి గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీ భారతి స్కూలు అడ్మిషన్లు నిర్వహిస్తూ, ఫీజులు వసూలు చేస్తున్నట్టు సమాచారం వచ్చిందని, ఈ నేపథ్యంలో యాజమాన్యానికి నోటీసు ఇచ్చామన్నారు. పిల్లలను గుర్తింపు లేని పాఠశాలలో చేర్పించడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే విద్యా పథకాలు, సంక్షేమ ప్రయోజనాలు, ఉపకార వేతనాలు, తల్లికి వందనం, యూనిఫాం, మధ్యాహ్న భోజన పథకం వంటివి వర్తించవని వెల్లడించారు.
రూ.2 లక్షల నగదు అపహరణ
ఏలూరు టౌన్: ఏలూరు ఆర్‌ఆర్‌పేట రైల్వే ట్రాక్‌రోడ్డులోని ఓ ఏసీల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఏలూరు సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన గేదెల చంద్రశేఖర్ గత ఏడాది కాలంగా రైల్వేట్రాక్ రోడ్డులో డైకిన్ సాయిబాలాజీ కూలింగ్ సొల్యూషన్స్ పేరుతో ఏసీల విక్రయ దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి యథావిధిగా తన పనులు ముగించుకుని షాప్ షట్టర్లకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి షాపు వెనుకవైపు షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా కౌంటర్‌లోని రూ.2 లక్షల నగదు అపహకరణకు గురయ్యాయని గుర్తించాడు. సీసీ కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి లోనికి ప్రవేశించి కౌంటర్‌లోని నగదు అపహరించినట్లు గుర్తించారు. షాప్ యజమాని చంద్రశేఖర్ ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దెందులూరు: ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు దెందులూరు ఎస్సై డి.వెంకట్ కుమార్ తెలిపారు. పెరుగుగూడెం గ్రామానికి చెందిన మోత్కూరి లక్ష్మణరావు కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని చెప్పి ఏలూరుకు చెందిన మాగంటి లక్ష్మీ రత్న దుర్గ వాణి, మాగంటి అశోక్ కుమార్ రూ.1.20 కోట్లు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. నకిలీ రసీదులు, అడ్మిషన్ పత్రాలు, లేఖలు, ఇతర డాక్యుమెంట్లు సృష్టించి ఫిర్యాదుదారున్ని మోసం చేశారన్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నిందితులు విచారణకు సహకరించకుండా తప్పించుకుంటూ వచ్చారన్నారు. అరెస్ట్ చేసిన నిందితులను ఏలూరు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.


