రూ.10 కోట్లతో స్కూల్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏఎంసీ చైర్మన్ పదవికి రూ.30 లక్షల బేరం, వైస్ చైర్మన్ పదవికి రూ.15 లక్షలు, పీఏసీఎస్ చైర్మన్ పదవికి రూ.10 లక్షల నుంచి 12 లక్షలు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.లక్ష, ఇసుక ర్యాంపు కోసం అడ్వాన్సు రూ.25 లక్షలు.. ఇదీ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వసూళ్ల చిట్టా. పదవులకు, పనులకు, పోస్టింగులకు ఇలా ప్రతిదానికి రేటు కట్టి ముక్కుపిండి వసూలు చేయడం ఆయన ప్రత్యేకత. ఇది కాకుండా పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా చేసుకోవడానికి ప్రతి శాఖ నుంచి టార్గెట్ పెట్టి మరీ వసూలు చేశారు. ఇలా జిల్లా రాజకీయాల్లో గత ఆరు నెలలుగా పోలవరం ఎమ్మెల్యే వ్యవహారశైలి హాట్ టాపిక్‌గా మారింది. ఇవన్నీ కాకుండా కుటుంబ వ్యవహారం కూడా ఇబ్బందికరంగా మారడం, సొంత పార్టీ శ్రేణులే ఫిర్యాదులు చేసిన క్రమంలో ఎట్టకేలకు పార్టీ అధినేత పిలిచి గట్టిగా క్లాస్ పీకినట్లు సమాచారం.
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆది నుంచి దూకుడు వ్యవహార శైలితో కొనసాగుతున్నారు. తారాస్థాయిలో అవినీతికి పాల్పడుతూ పెద్ద ఎత్తున వసూళ్ల దందాకు తెరలేపడంతో పాటు తరచూ వివాదాల్లో కొనసాగుతూనే ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో వర్గ విభేదాలు, టీడీపీ నేతలతో దూరం, ఇవన్నీ కాకుండా కుటుంబంలో తీవ్ర సమస్యలు ఇలా అన్నీ చుట్టుముడుతున్నా అవినీతి దందా మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని కూటమి నేతలే ఫోన్‌లో మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ కావడం ఎమ్మెల్యే పరిస్థితికి నిదర్శనం. తాజాగా కొద్ది రోజుల క్రితం పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల పేరిట ఎమ్మెల్యే చేసిన అవినీతి వ్యవహారాలకు సంబంధించి 7 పేజీల ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే రీతిలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు అందింది. దీంతో పాటు ఎమ్మెల్యే భార్య గతంలో పవన్ కల్యాణ్‌ను కలవడానికి మూడు, నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమై, ఇటీవల కలిసి బాలరాజుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల క్రమంలో శనివారం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యే బాలరాజు వెళ్లి కలిశారు.
అధిష్టానం సీరియస్
పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ.147 కోట్ల నిధులు పోలవరానికి ఇస్తే అభివృద్ధి పనులు ఎందుకు చేయలేకపోయారు. ఇదేం పద్ధతి.., ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని పవన్ కల్యాణ్ క్లాస్ పీకినట్లు సమాచారం. ఫిర్యాదులోని అన్ని అంశాలకు సమగ్ర వివరణ ఇవ్వాలని, అలాగే కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని కుటుంబ సమస్యను నాలుగు వారాల్లో చక్కదిద్దుకోవాలని, అధికారులను సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేసేలా చూడాలని సూచించినట్లు సమాచారం.
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అధిష్టానానికి ఫిర్యాదు
పదవులు, పనులు అన్నింటా వసూళ్లే
ఏఎంసీ చైర్మన్ పదవికి రూ.30 లక్షలు, వైస్ చైర్మన్‌కు రూ.15 లక్షలు
రెండేళ్ళల్లో భారీగా పెరిగిన వ్యక్తిగత ఆస్తులు
ఎమ్మెల్యేను వివరణ కోరిన పవన్ కల్యాణ్
కుటుంబ వివాదాలపైనా వివరణ కోరినట్లు సమాచారం
మక్కినవారిగూడెం పీఏసీఎస్ చైర్మన్ పదవి కోసం ఒకరి వద్ద రూ.10 లక్షలు, మరో నేత వద్ద రూ.15 లక్షలు, టీ. నర్సాపురం పీఏసీఎస్ చైర్మన్ పదవి కోసం రూ.15 లక్షలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.లక్ష, కొత్త పట్టిసీమ పీఏసీఎస్ చైర్మన్ పదవి కోసం రూ.7 లక్షలు, గూటాల ఇసుక ర్యాంపు కోసం రూ.25 లక్షలు, అండర్–16 క్రికెట్ టీమ్ కోసం రూ.5 లక్షలు, బ్రాందీషాపు సిండికేట్ నుంచి లక్షల వసూళ్లు ఇలా ప్రతి పనికి వసూళ్లకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఎమ్మెల్యే సొంత గ్రామమైన బర్రింకలపాడులో క్యాంపు ఆఫీసు సమీపంలో రూ.10 కోట్ల వ్యయంతో 56 గదుల స్కూల్‌ను నిర్మిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మధురా రెస్టారెంట్‌ను కోటిన్నరకు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


