రోడ్డెక్కిన ఆక్వా రైతు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన ఆక్వా రైతు

May 24 2026 1:21 AM | Updated on May 24 2026 1:21 AM

ఉండి: ఆక్వా రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ శనివారం ఉండిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీగా ఉండి సెంటర్‌కు చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఆదుకోవాలని, రొయ్యల కొనుగోలు సిండికేట్లపై చర్యలు తీసుకో వాలని వారు నినాదాలు చేశారు. కూటమి నాయకులైన ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండికి చెందిన రైతు పూసపాటి వెంకట్రాజు తన చెరువులోని రొయ్యలను రోడ్డుపై పోయడంతో పాటు, స్థానికులకు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా మేతల ధరలు పెరిగినప్పటికీ, మేతల తయారీదారులు, రొయ్యల కొనుగోలుదారులు ఏకమై కిలోకు రూ.50 చొప్పున ధర తగ్గించి రైతుల వెన్నువిరుస్తున్నారని వారు మండిపడ్డారు. అంతేకాకుండా, రొయ్యల పట్టుబడికి అవసరమైన లారీలను పంపించకుండా తాత్సారం చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

వేలకోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇస్తున్న ఆక్వా రంగంపై ఎలాంటి భరోసా లేదని, ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సిండికేట్లపై చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఆక్వా సాగుకు క్రాప్‌ హాలిడే ప్రకటించడానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. మండలానికి ఒకటి చొప్పున కోల్డ్‌ స్టోరేజ్‌లను ప్రభుత్వమే నిర్మించాలని, అప్పుడే ఆక్వారైతు నిశ్చింతగా ఉండగలడని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించుకుంటేనే ఆక్వా రైతు బతుకుతాడని లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమన్నట్లు రైతుల పరిస్థితి ఉందని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు యూనిట్‌ విద్యుత్తును రూ.1.50కే అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించని పక్షంలో అమరావతికి పాదయాత్ర చేస్తామని, ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే తగిన విధంగా ఆక్వారైతుల స్పందన ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఆక్వా రైతు ఆవేదనలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు.

ఉండిలో నిరసన ర్యాలీ

రొయ్యలు రోడ్డుపై పోసి ఆందోళన

సిండికేట్‌లపై చర్యలు తీసుకోవాలని నినాదాలు

కేజీకి రూ.50 తగ్గించి రైతును ముంచేస్తున్నారంటూ ఆందోళన

Advertisement
 
Advertisement
Advertisement