తాగునీటి చెరువులో రొయ్యల సాగు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి చెరువులో రొయ్యల సాగు

May 24 2026 1:21 AM | Updated on May 24 2026 1:21 AM

వరదలకు కొట్టుకొచ్చిన రొయ్యలు

పెంచికలమర్రులో రాత్రికి రాత్రే రొయ్యల పట్టుబడి

పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులపై అధికారుల తప్పుడు నివేదికలు

పంచాయతీ చెరువుల్లో రొయ్యల సాగు నిషేధం. వరదలకు ఎగువ నుంచి కొట్టుకొచ్చిన రొయ్యలు పెంచికలమర్రు చెరువులో పడ్డాయి. అసలు ఇక్కడ చెరువుల్లో సాగు జరగడం లేదు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, తహసీల్దారుతో కలిసి పరిశీలించాను.

– బి.రాజ్‌కుమార్‌,

జిల్లా మత్స్యశాఖ అధికారి, ఏలూరు

సాక్షి, టాస్క్‌ఫోర్సు: పెంచికలమర్రు రక్షిత నీటి పథకం చెరువులో రాత్రికి రాత్రి సుమారు రూ.30 లక్షల రొయ్యలను పట్టుకుని అమ్మేశారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాపీగా వచ్చిన జిల్లా స్థాయి అధికారులు అసలు సాగే లేదని, వరదలకు రొయ్యలు ఈ చెరువులోకి కొట్టికొచ్చాయని జిల్లా కలెక్టర్‌కే ఝలక్‌ ఇస్తూ నివేదిక ఇచ్చారు. కై కలూరు మండలం పెంచికలమర్రులో 2000 సంవత్సరంలో సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. కొల్లేరు పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసే ఉద్ధేశంతో ఏర్పాటు చేశారు. నీటిని నిల్వ చేసుకోడానికి ఒక్కో చెరువు 20 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 3 చెరువులు కలిపి 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. సమీపంలో చేపల చెరువుల సంఖ్య పెరగడంతో ఇక్కడ నీరు కలుషితమైంది. కాల్వల ద్వారా నీటి సరఫరా లేదు. 2019లో పంచాయతీ చెరువులో చేపల పట్టుబడికి పాటలు పెట్టి అదాయాన్ని పంచాయతీ తీసుకుంది. సీడబ్ల్యూఎస్‌ స్కీం చెరువులు ఇప్పుడు రాజకీయ నేతల అండతో అక్రమ సాగుకు కేరాఫ్‌గా మారాయి.

జిల్లా కలెక్టర్‌కు తప్పుడు నివేదికలు

పెంచికలమర్రు వాటర్‌ స్కీంలో 20 ఎకరాల్లో రొయ్యల సాగు, మరో 20 ఎకరాల్లో చేప పిల్లల సాగును ముగ్గురు కలిసి చేస్తోన్నారు. మంచినీటి చెరువుల్లో రసాయనాలతో రొయ్యల సాగు నిషేధం. రొయ్యల సాగుపై పీజీఆర్‌ఎస్‌లో మే 4న ఫిర్యాదు చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ గిరి, స్థానిక డీఈ సత్యనారాయణ, ఏఈ నాగబాబు ఆక్వా సాగు జరగడం లేదని ఎండార్స్‌మెంట్‌ ఇచ్చారు. దీనిపై ఫిర్యాదుదారుడు తిరిగి పీజీఆర్‌ఎస్‌లో చెరువుల్లో చేపలు, రొయ్యలు ఉంటే అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చినందుకు తనను శిక్షించండని మరో ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం జిల్లా ఫిషరీస్‌ అధికారి రాజ్‌కుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి కడియాల శ్రీనివాసరావు, ఏఈ నాగబాబు, తహసీల్దారు రామకృష్ణారావులు వచ్చి చెరువులను పరిశీలించారు. అయితే శుక్రవారం రాత్రే ఈ చెరువులో రొయ్యల పట్టుబడులు చేశారు. కొల్లేరు మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని రూ.కోట్లు గడిస్తున్న అక్రమార్కుడు అండతోనే పెంచికలమర్రు తాగునీటి చెరువుల్లో రొయ్యల సాగు జరుగుతోంది. అధికారులు ఎవరూ తన మాట కాదనరని, ఎవరైన అధికారులు వస్తే తన సామాజికవర్గ ప్రజలను ఉసిగెల్పి గొడవ చేయిస్తానని బీరాలు పలుకుతున్నాడు. అప్పుడప్పుడు మత్స్యశాఖ మంత్రితో ఫొటోలు దిగి గొప్పలు చెప్పుకుంటున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement