జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో శనివారం ఆంజనేయస్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,98,573 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 2405 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు.
నరసాపురం: మొగళ్తూరు మండలంలోని మొళ్లపర్రు, పేరుపాలెం, కేపీపాలెం బీచ్‌లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ రాహుల్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బీచ్‌ల అభివృద్ధిపై శనివారం ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యాటక అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టుల నిర్మాణ సమస్యలపై చర్చించారు. పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యాపార వర్గాలతో పాటు మత్స్యకారులకు కూడా భూములను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రజలు అపోహలు వీడి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. యువతకు, పెట్టుబడిదారులకు పర్యాటక, పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాల ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు. ఈ సమీక్షలో ఆర్‌డీవో దాసి రాజు, పర్యాటక అభివృద్ధి అధికారి ఎ. వెంకట అప్పారావు, తహసీల్దార్ రాజ్ కిషోర్ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం అర్బన్: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో అడ్మిషన్లు పెంచేందుకు ఆ శాఖ అధికారులు, హాస్టళ్ల నిర్వాహకులు, అసిస్టెంట్లు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్‌వీ అరుణకుమారి ఆదేశించారు. శశి ఇంజినీరింగ్ కాళాశాల సెమినార్ హాలులో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల అధికారులు, అసిస్టెంట్లు, సిబ్బందికి సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది హాస్టళ్లలో విద్యార్థులు వసతికి చేరేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. విద్యాభివృద్ధి, ఆరోగ్యం, భద్రత, సమగ్ర వికాసాన్ని, నిర్ణీత మోను ప్రకారం పౌష్టికాహారం అందచేయడమే లక్ష్యంగా చేసుకుని అన్ని హాస్టళ్ళలో సౌకర్యాలను ప్రభుత్వం కల్పింస్తుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ సహాయ అధికారి బాలగోపాల రామాంజనేయరాజు, తాడేపల్లిగూడెం అర్బన్ వార్డు వెల్ఫేర్ సెక్రటరీలు పాల్గొన్నారు.


