రోడ్డున పడ్డ రొయ్య రైతు | - | Sakshi
Sakshi News home page

రోడ్డున పడ్డ రొయ్య రైతు

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

ఫోన్‌ ఎత్తే నాథుడే లేడు

సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్‌ : రొయ్య ధరలు పతనంపై ఆక్వా రైతులు రోడ్డెక్కారు. సిండికేట్‌ దోపిడీని అడ్డుకోకపోతే చావే శరణ్యమంటూ రొయ్యలు రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. తమకు గొంతెమ్మ కోరికలు లేవని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేస్తే చాలంటూ మండుటెండలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.

రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు

పదిరోజుల వ్యవధిలో రొయ్య ధరలు కిలోకు 100 కౌంట్‌ రూ. 265 నుంచి రూ.230కు, మిగిలిన కౌంట్లు రూ.30 నుంచి రూ.50 వరకు పతనం కావడంపై జై భారత్‌ క్షీరారామ ఆక్వారైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు ఆధ్వర్యంలో శుక్రవారం పాలకొల్లులో రైతులు ఆందోళన చేశారు. మండుటెండలో పూలపల్లి వై.జంక్షన్‌ వద్ద తొట్టెల్లోని రొయ్యలు రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. కొద్దిసేపు ట్రాఫిక్‌ను స్తంభింప చేశారు. రొయ్య ధరల పతనంతో తీవ్రంగా నష్టపోతున్నామని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ నాయకులు, రైతులు మాట్లాడుతూ నాలుగు నెలలు పాటు చెరువుల వద్ద కాపలా ఉండి ప్రతికూల వాతావరణం, పరిస్థితులకు ఎదురొడ్డి ఆక్వా కల్చర్‌ చేస్తే.. సీడు, ఫీడు, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యాజమాన్యాలు, ఎక్స్‌పోర్టర్స్‌ ఏకమై రైతుల కష్టాన్ని అడ్డంగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల మేత ధరలను పెంచుతున్నట్టు ఫీడ్‌ కంపెనీలు ప్రకటించగా రైతులు రొడ్డెక్కడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని పెంపును తాత్కాలికంగా వాయిదా వేసిందన్నారు. వచ్చే నెల నుంచి ఫీడు ధరలు పెంచుతామని కంపెనీలు చెబుతున్నాయని, ఈ లోగా రైతులను ఏదో విధంగా దోచేయాలని రొయ్య రేట్లు తగ్గించారని మండిపడ్డారు. ఫీడ్‌ రేట్లు పెంచితే ఉపేక్షించేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులను ఏకం చేసే దిశగా రాష్ట్ర కమిటీ ఏర్పాటుకోసం త్వరలో అమలాపురంలో రాష్ట్ర స్థాయిలో ఆక్వా రైతుల సమావేశం నిర్వహించనున్నట్టు గాంధీభగవాన్‌రాజు తెలిపారు.

ఎన్నికల హామీల అమలేది

అధికారంలోకి వస్తే రూ.1.50 కే సబ్సిడీ విద్యుత్‌ను అందిస్తామని, కోల్డ్‌ స్టోరేజీలు నిర్మాణం, ఏరియేటర్లపై సబ్సిడీ ఇస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. సబ్సిడీ విద్యుత్‌ కోసం వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. తాము కొత్తగా గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను మాత్రమే అమలుచేయమని కోరుతున్నామని రైతులు స్పష్టంచేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో క్రాప్‌ హాలిడేకు వెళ్లనున్నట్టు రైతులు ప్రకటించారు. సంఘ నాయకులు బోణం చినబాబు, మేకా ఫణి, రుద్రరాజు సత్యనారాయణరాజు, పెన్మెత్స సత్యనారాయణరాజు, సోమేశ్వరరాజు, సోమరాజు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

స్తంభించిన ట్రాఫిక్‌

వైఎస్సార్‌సీపీ హయాంలో అప్సడాలో ఫోన్‌ చేస్తే వెంటనే స్పందించి రైతుల సమస్య పరిష్కారానికి కృషిచేసేవారు. ఇప్పుడు ఫోన్‌ చేస్తే ఎత్తే నాథుడు లేడని రైతులు వాపోతున్నారు. రైతులు ఐకమత్యంగా ఉంటే సిండికేట్‌ దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చని, సాగు పూర్తయ్యాక రెండు మూడు నెలలు పాటు చెరువును ఎండగట్టి సాగుచేస్తే మంచి కౌంట్‌ వచ్చే వీలుంటుందన్నారు. వంద కౌంట్‌ వల్ల రైతులకు ఒరిగేదేమీ ఉండదని నిరసనలో పాల్గొన్న రైతులు తెలిపారు. అధికశాతం మంది రైతులు సాగు పూర్తయ్యాక చెరువును ఎండగట్టకుండా మళ్లీ సాగు ప్రారంభించడం వల్ల సీడు, ఫీడు, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, ఎక్స్‌పోర్టర్స్‌ బాగుపడుతున్నారన్నారు. రైతుల్లోని అనైక్యతను సిండికేట్‌ తమకు అనుకూలంగా మలుచుకుంటోందని వివరించారు. రెండు మూడు నెలలు విరామం ఇస్తే సీడు, ఫీడు, పాస్రెసింగ్‌ ప్లాంట్లు, ఎక్స్‌పోర్టర్స్‌కు వ్యాపారం జరగక వారంతా దారిలోకి వస్తారన్నారు. ఆ దిశగా రైతుల్లో చైతన్యవంతం కావాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు.

ధరల పతనంపై ఆగ్రహం

పాలకొల్లులో రొయ్యలు రోడ్డుపై పడేసి నిరసన

సిండికేట్‌ దోపిడీని అరికట్టాలని డిమాండ్‌

ప్రభుత్వం స్పందించకుంటే క్రాప్‌ హాలిడేకు వెళ్తామంటున్న రైతులు

Advertisement
 
Advertisement
Advertisement