భీమవరం: వీరవాసరం మండలంలోని కూటమి నాయకుల మధ్య విభేదాలు రోజురోజుకూ రచ్చకెక్కుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అక్రమ మద్యం, మట్టి తరలింపు వ్యాపారాలు చేస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారని టీడీపీ నాయకులే అధికారులకు ఫిర్యాదు చేయడం భీమవరం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కూటమిలోని టీడీపీ నాయకులు గ్రూపులుగా విడిపోయి, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా వేసవి సీజన్‌లో మట్టి విక్రయాలు జోరుగా సాగుతుండగా, వీరవాసరం మండలంలోని కొంతమంది కూటమి నాయకులు పైరవీలు చేస్తూ ట్రాక్టర్లు, లారీలు, జేసీబీల యజమానుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. మట్టి తోలకాలకు అడ్డంకులు లేకుండా చూడాలంటే పార్టీ అధినాయకులకు, అధికారులకు ముడుపులు ముట్టచెప్పాలంటూ మట్టి తరలించే వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. మరికొంతమంది నాయకులైతే తమ సొంత ట్రాక్టర్లు, లారీలు, జేసీబీలను ఉపయోగించి మట్టిని తరలిస్తున్నారు. ప్రస్తుతం మండలంలోని పలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు సొంత అవసరాల కోసం మట్టిని తరలించే వారి సంఖ్య భారీగా పెరిగింది. అనేక చోట్ల ప్రధాన రహదారుల వెంట ఉన్న పంట పొలాలను పూడ్చి మెరక చేస్తున్నారు.
రెవెన్యూ అనుమతులు లేకపోవడం వరం
మట్టి తరలింపునకు సంబంధించి రెవెన్యూ అధికారుల అనుమతులు అవసరం లేకపోవడం రాజకీయ నాయకులకు బాగా కలిసివచ్చింది. కొంతమంది నాయకులు రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పార్టీ అధినాయకులకు ముడుపులు ఇవ్వాలంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అసంతృప్తితో ఉన్న మరో వర్గం నాయకులు ఇటీవల వీరవాసరం మండల పరిషత్ సమావేశంలో అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని అధికారులను కోరారు. విచ్చలవిడిగా మట్టి లారీలు, ట్రాక్టర్లు తిరగడం వల్ల రహదారులు ధ్వంసమవుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాసరావు, బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు వి.దివాకర్, జనసేన మండల ప్రధాన కార్యదర్శి జి. విజయలక్ష్మి కలిసి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడం విశేషం. అలాగే శుక్రవారం భీమవరంలో టీడీపీ నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోట సీతారామలక్ష్మికి కూడా ఈ విషయమై ఫిర్యాదు చేశారు.
ఇంతకుముందు కూడా వీరవాసరం మండలంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, బెల్ట్ షాపులకు కొదవలేకుండా పోయిందని, అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద వీరవాసరం మండలంలో కూటమి నాయకుల అంతర్గత విభేదాల వల్ల జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో కూటమి పార్టీల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అధికారులు, పార్టీ పెద్దలకు టీడీపీ నేతల ఫిర్యాదు
మట్టి తరలింపుతో రోడ్లు పాడవుతున్నాయని ఆందోళన
మద్యం అధిక ధరలకు విక్రయించడంపైనా ఫిర్యాదు


