పోలీసులు కొట్టడం వల్లే మృతి | - | Sakshi
Sakshi News home page

పోలీసులు కొట్టడం వల్లే మృతి

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

పోలీసులు కొట్టడం వల్లే మృతి జీతాల నిలిపివేత అన్యాయం భారీగా పెరిగిన విద్యుత్‌ వాడకం వైఎస్సార్‌సీపీ నిరసనకు అనుమతి నిరాకరణ

భీమవరం: కుటుంబ సభ్యుల వేధింపులు, పోలీసులు కొట్టడం వల్లే తన కుమారుడు నవీన్‌కుమార్‌ మృతిచెందాడని మృతుని తల్లి వీధి బుజ్జి శుక్రవారం భీమవరం డీఎస్పీ రఘువీర్‌ విష్ణుకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మృతిపై పలు అనుమానాలున్నాయని, పోస్టుమార్టం రిపోర్టు కూడా బయటపెట్టడం లేదని, కారకులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్పందించిన డీఎస్పీ కేసు ఏలూరు రేంజ్‌ ఐజీ పరిధిలో ఉందని, జిల్లా ఎస్పీ మానిటరింగ్‌ చేస్తున్నారని చెప్పారు. కేసు విచారణ పూర్తి పారదర్శకంగా ఉంటుందని న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.

యలమంచిలి: అనంతపురం జిల్లాలోని సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీల మే నెల జీతాలను నిలిపివేయాలని జిల్లా అధికారి ఇచ్చిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. పశ్చిమగోదావరి జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ ఉమర్‌ అలీషా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల పొట్ట కొట్టేలా ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేయడం అత్యంత బాధాకరమన్నారు. సచివాలయ సిబ్బంది కేవలం ఆధార్‌ సేవలకే పరిమితం కాలేదన్నారు. ఉద్యోగులు సకాలంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, వారిపై ఉన్న అదనపు పనిభారాన్ని గుర్తించకుండా, జీతాలు నిలిపివేస్తామని బెదిరించడం వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల నిలిపివేతకు జారీ చేసిన సదరు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.

భీమవరం: భానుడి భగభగలతో జిల్లాలో గత వారం రోజులుగా విద్యుత్‌ వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో అనధికారిక విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే వడగాల్పులు వీచడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. సాయంత్రం 5 వరకు ఎండ వేడిమిని తట్టులేకపోవడంతో ఎక్కువ మంది ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్స్‌ వద్ద సేదతీరుతున్నారు. గ్రామాల్లోని ప్రజలు ఇంటివద్దే ఉండడంతో ఏసీల వాడకం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈనెల 14న 11.581 మిలియన్‌ యూనిట్స్‌ విద్యుత్‌ను వినియోగించగా 15న 11.670, 16న 11.927 మిలియన్‌ యూనిట్స్‌ వినియోగించారు. 18న 12.009, 19న 12.279, 20న 12.503 మిలియన్‌ యూనిట్స్‌ విద్యుత్‌ను వినియోగించారు. గత రెండు రోజులుగా మరింత పెరిగి దాదాపు 13 మిలియన్‌ యూనిట్స్‌కు చేరినట్లు చెబుతున్నారు. మరో నాలుగు రోజులు ఎండ తీవ్రత, వడగాల్పులు ఉండడంతో విద్యుత్‌ వాడకం మరింత పెరిగే అవకాశముంటుందని దాంతో అనధికారిక విద్యుత్‌ కోతలు పెరిగే ప్రమాదముందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నూజివీడు: గిట్టుబాటు ధర లేక నష్టపోయిన మామిడి, మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 23 న వైఎస్సార్‌సీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పట్టణ పోలీసులు అనుమతి నిరాకరించినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు మైలవరం రోడ్డులోని అంబేద్కర్‌ సెంటర్‌లో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనంతరం సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పట్టణ సీఐను అనుమతి కోరుతూ లేఖ అందజేశారు. రైతులకు సంబంధించిన సమస్యలపైన నిరసన తెలపడానికి సీఐ అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. అనుమతి నిరాకరించడం వెనుక ఒత్తిడులు ఉండొచ్చని వైఎస్సార్‌సీపీ నాయకులు భావిస్తున్నారు.

ద్వారకా ఎస్టేట్‌కు తరలిరండి:

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు

అబేంద్కర్‌ సెంటర్‌లో రైతుల నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించినందున నియోజకవర్గవ్యాప్తంగా తరలి వచ్చే మామిడి, మొక్కజొన్న రైతులతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయమైన ద్వారకా ఎస్టేట్‌ వద్దకు రావాలని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement