భీమవరం (ప్రకాశంచౌక్): రానున్న వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. వేసవి తీవ్రతపై గురువారం ఆర్డీవోలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఇన్‌చార్జి కలెక్టర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అవసరాల మేరకు వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేయాలన్నారు. బస్టాండ్, మార్కెట్ ప్రదేశాలు, ముఖ్య కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వడగాల్పులపై తీసుకోవలసిన జాగ్రత్తలపై పట్టణాల్లోని ముఖ్య ప్రదేశాలలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో, పీహెచ్‌సీలలో అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. పక్షులు, జంతువుల కోసం పశు సంవర్థక శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పారిశుధ్యంపై దష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆయన అధికారులను కోరారు.


