భీమవరం: జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేయడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడం, పారదర్శకమైన పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా పోలీసు యంత్రాంగం పనిచేయాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. గురువారం భీమవరం డీఎన్నార్ కళాశాలలో జిల్లా స్థాయి నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక అంశాలపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. అనంతరం ఇటీవల రాష్ట్రస్థాయిలో అత్యున్నత డీజీపీ కమెండేషన్ డిస్క్ అవార్డులందుకున్న ఐదుగురు పోలీసు సిబ్బంది, విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.


