● నేడు కేంద్ర బృందం రాక
● వెంకట్రామన్నగూడెంలో పర్యటన
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏళ్ల నాటి కల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైమానిక విధానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల పరిధిలో విమానాశ్రయ నిర్మాణం కోసం భూసేకరణ చేయాలనుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలో గురువారం కేంద్ర కమిటీ బృందం విమానాశ్రయ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, కార్యకలాపాల కోసం వివరాల సేకరణకు ఇక్కడకు రానుంది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో..
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ అవసరాల కోసం రహస్య విమానాశ్రయాన్ని తాడేపల్లిగూడెంలో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించారు. అయితే ఒక్క విమానం కూడా ఇక్కడ ల్యాండ్ కాలేదు. విమానాశ్రయం కోసం సేకరించిన 653.48 ఎకరాల భూ మి, ఈ భూమిలో 1.90 కిలోమీటర్ల మేర నిర్మించిన రన్‌వే ఉంది. విశాఖలో ఉండే కేంద్ర ప్రభుత్వ అధి కారి ఈ భూములకు కస్టోడియన్‌గా ఉన్నారు. త ర్వాత కాలంలో ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్రతిపాదించి టెండర్ల దశకు చేరినా కార్యరూపం దాల్చ లేదు. తర్వాత కాలంలో ఈ భూమిలో ఏయూ క్యాంపస్‌కు 100 ఎకరాలు, ఇంటి నిర్మాణాలకు 153 ఎకరాల భూమిని కేటాయించారు. అలాగే ఏపీ నిట్‌కు 170 ఎకరాల భూమి కేటాయించారు. దీంతో ఈ భూముల్లో ఎయిర్‌పోర్టు ప్రతిపాదన పూ ర్తిగా ఆగిపోయింది.
పట్టాలెక్కని ప్రతిపాదనలు
పట్టణానికి సమీపంలో వెంకట్రామన్నగూడెంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆధీనంలో ఉన్న భూముల్లో ఇజ్రాయెల్ సహకారంతో పైలెట్‌రహిత యుద్ధ విమానాల విడిపరికరాల నిర్మాణం చే పట్టాలని భావించారు. అయితే అదీ కార్యరూపం దాల్చలేదు. మచిలీపట్నంలో సైనిక అవసరాల కోసం నిర్మించిన రాడార్ స్టేషన్, సైనికుల శిక్షణా అవసరాల కోసం ఈ భూమిని వినియోగించాలనే ప్రతిపాదన వచ్చినా పట్టాలెక్కలేదు. ఇదిలా ఉండగా విమానాశ్రయం ఏర్పాటుకు ఏవియేషన్ వి భాగం నుంచి విండ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందారు. రేఖాంశాల మధ్య గాలుల గమనం గురించి అ ధ్యయనం చేసి అప్పట్లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే డొమిస్టిక్, రవాణా అవసరాల కోసం 50 కిలోమీటర్ల పరిధిలో సర్వే చేయగా తాడేపల్లిగూడెం అనువైందనే నివేదిక కూడా వచ్చింది.


