జీలుగతో భూసారం పెంపు | - | Sakshi
Sakshi News home page

జీలుగతో భూసారం పెంపు

May 21 2026 10:01 AM | Updated on May 21 2026 10:01 AM

జీలుగతో భూసారం పెంపు

కాళ్ల: పంటల సాగులో రోజురోజుకు పెరుగుతున్న రసాయనిక ఎరువుల వాడకం వలన భూసారం తగ్గిపోయి నేల ఆరోగ్యం క్షీణిస్తుందని, ఇటువంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట సాగు చేయడం అవసరమని మండల వ్యవసాయాధికారి పి.రమేష్‌ నాయుడు తెలిపారు. జీలుగ విత్తనాలు భూసారాన్ని పెంచే అత్యుత్తమ పచ్చిరొట్ట ఎరువు. పంటలను విత్తడానికి ముందు పచ్చిరొట్ట సాగు చేసి నేలలో కలియదున్నాలని. తద్వారా నేలకు ముఖ్యమైన పోషకాలు అంటే ముఖ్యంగా నత్రజని, కొంత మేరకు భాస్వరం, పొటాష్‌లతో పాటు ఇతర సూక్ష్మ పోషకాలు కూడా నేలకు అందుతాయని చెప్పారు. తద్వారా భూసారం పెరిగి, నేల ఆరోగ్యం కూడా మెరుగవుతుందన్నారు. పచ్చిరొట్ట ఎరువులుగా సాగు చేయడానికి అనువైన పంటలు ముఖ్యంగా జనుము, జీలుగ, పెసర, పిల్లిపెసర అని తెలిపారు. ఈ పంటలను నేలలో ప్రధాన పంట విత్తడానికి ముందుగా సాగు చేసుకొని 30–40 రోజులలో అంటే 50 శాతం పూత దశలో నేలలో కలియదున్నాలి. ఈ పచ్చిరొట్ట ఎరువులను నేలలో కలియదున్నిన వెంటనే ఒక ఎకరాకు 3 బస్తాల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ కనుక వేసుకున్నట్లయితే పచ్చిరొట్ట బాగా చివికి నేలకు మంచిగా అందడమే కాకుండా ప్రధాన పంటకు భాస్వరం ఎరువులైన డీఏపీ కానీ సూపర్‌ ఫాస్పేట్‌ కానీ వేయాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. జీలుగ విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా 50 శాతం రాయితీపై అందజేస్తుందని, ప్రస్తుతం మండలంలోని అన్నీ రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement