చెరువుల్లో అడుగంటిన నీరు
పసర్లతో నిండి..
భీమవరం: మండుటెండలో గుక్కెడు నీళ్లు కోసం పలు గ్రామాల్లో ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. పంచాయతీ మంచినీటి చెరువుల్లో నీరు అడుగంటడం, నీరు పసర్లు పట్టి దుర్వాసన రావడంతో తాగునీటి కొనుగోలు చేసి తాగాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో ఆరు మున్సిపాల్టీలతోపాటు సుమారు 409 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో పంచాయతీలకు అనుబంధంగా శివారు గ్రామాలు ఉన్నాయి. భీమవరం వంటి పట్టణంలో నిత్యం మంచినీటి సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరే శివారు ప్రాంతాలకు దిక్కవుతుంది. పాలకొల్లులో అయితే ఒంటిపూట నీరే గతి.
321 మంచినీటి చెరువులు
జిల్లాలోని 409 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 321 మంచినీటి చెరువులు ఉన్నాయి. చెరువుల నీటిని ఓవర్‌హెడ్ ట్యాంకుల నుంచి పైప్‌లైన్స్ ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే వేసవిలో దాదాపు 40 రోజుల పాటు కాలువలకు నీటి సరఫరాను నిలుపుదల చేయడంతో గ్రామాల్లో మంచినీటి సరఫరాకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దాదాపు అన్ని పంచాయతీల్లో 40 రోజులకు సరిపడా నీటిని నిల్వ చేసే చెరువులు లేవు. దీంతో కాలువలను కట్టేముందు మంచినీటి చెరువులను పూర్తిగా నీటితో నింపుకోవాలని అధికారులు పంచాయతీ అధికారులను ఆదేశిస్తుంటారు. కొన్ని గ్రామాల్లో అధికారులు నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా చెరువులను నింపకపోవడంతో మే నెలలో మంచినీటి ఎద్దడి ఏర్పడు తోంది. చెరువుల్లో నీరు అడుగంటి, నీరు పసర్ల బారిన పడటం, దుర్వాసన రావడంతో పంచాయతీ సరఫరా చేసే నీటిని వాడుకోడానికి పనికిరావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో అడుగంటిన నీటిని పూర్తిగా క్లోరినేషన్ చేయకుండానే పైప్‌లైన్స్ ద్వారా సరఫరా చేస్తున్నారని వాపోతున్నారు. ఈ నెలాఖరుకు కాలువలకు నీటిని వదులనున్నా శివారు గ్రామాలకు చేరే సరికి మరో వారం, పది రోజులు సమయం పడుతుందని అప్పటివరకు చెరువుల్లో ఉన్న నీరు సరిపోయే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జలవనరుల శాఖ మంత్రి ఇలాకాలోనే..
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గమైన పాలకొల్లు పట్టణంలోని ప్రజలకు ఒంటిపూట నీటిని సరఫరా చే యడం విశేషం. అభివృద్ధిలో పథంలో దూసుకుపోతున్నామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా పట్టణ ప్రజలకు రెండు పూటలా మంచినీరు ఇచ్చే పరిస్థితే లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భీమవరం మండలం గొల్లవానితిప్పలో చెరువు
వీరవాసరం మండలంలో రంగు మారిన నీరు
తాగునీటికి కటకట
జిల్లాలో తాగునీటి కష్టాలు
చెరువుల్లో అడుగంటిన నీరు
కొన్నిచోట్ల పసర్లు పట్టిన నీరే సరఫరా
పాలకొల్లులో ఒంటిపూట సరఫరాతో సరి
గొల్లవానితిప్పలోని చెరువులో నీరు అడుగంటడంతో మంచినీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే చెరు వులో నీరు చాలా వరకు తగ్గిపోయింది. నెలాఖరుకు కాలువలకు నీటిని వదలినా మరో 10 రోజుల వరకు అంటే జూన్ 10 వరకు మా గ్రామానికి నీరు వచ్చే అవకాశం లేదు. అప్పటివరకు చెరువులో ఉన్న నీటిని ఎలా సరఫరా చేస్తారో చూడాల్సిందే.
– బోకూరి విజయరాజు, మాజీ సర్పంచ్, గొల్లవానితిప్ప
భీమవరం మండలంలోని పలు గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో నీరు పసరెక్కి పచ్చగా కన్పిస్తున్నాయి. ఎండ తీవ్రతతో నీరు రంగుమారి పోయింది. అదే నీటిని సరఫరా చేయడంతో వ్యాధులకు గురయ్యే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో నీటి పూర్తిగా క్లోరినేషన్ చేయించి కుళాయిల ద్వారా సరఫరా చేయాలి.
– పెనుమాల నర్సింహస్వామి, మాజీ ఎంపీటీసీ, భీమవరం మండలం


