ఇంధన భారంపై వైఎస్సార్‌సీపీ నిరసనాగ్రహం | - | Sakshi
Sakshi News home page

ఇంధన భారంపై వైఎస్సార్‌సీపీ నిరసనాగ్రహం

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

ఇంధన భారంపై వైఎస్సార్‌సీపీ నిరసనాగ్రహం

నరసాపురం: నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు

తణుకు అర్బన్‌: మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కారుమూరి. చిత్రంలో ఎమ్మెల్సీ రవీంద్రనాథ్‌, పార్లమెంట్‌ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు

సాక్షి, భీమవరం

నరసాపురంలో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాటి నుంచి ప్రజలపై మోయలేని భారాలు వేస్తూ, నిరంకుశ పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, నరసాపురం సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కోరుతూ నరసాపురంలో పాదయాత్ర నిర్వహించి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఆర్డీఓ దాసి రాజుకు వినతిపత్రం అందజేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు పీడీ రాజు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ బర్రే శ్రీవెంకటరమణ, ఎంబీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పెండ్ర వీరన్న తదితరులు పాల్గొన్నారు.

తణుకులో..

తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌, పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్రపతి రోడ్డు, నరేంద్ర సెంటర్‌ మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎడ్ల బళ్లు, గుర్రపు స్వారీ లతో వినూత్నంగా నిరసన తెలిపారు. కారుమూరి మాట్లాడుతూ నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ ఊదరగొట్టిన మంత్రి ఇంధన పొదుపు పేరిట సైకిల్‌పై తిరిగి ముందు, వెనుక నాలుగు కార్లలో వీడియో కవరేజీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఇంధన ధరలు పెంచమని మేనిఫెస్టోలో పేర్కొన్న కూటమి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ఇంధనంపై గుజరాత్‌, తమిళనాడులో 14 శాతం పన్ను ఉంటే రాష్ట్రంలో 31 శాతం వసూలు చేస్తున్నారన్నారు.

భీమవరంలో..

భీమవరంలో నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, పార్టీ శ్రేణులు ఉండి రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు వ్యాన్‌కు తాడుకట్టి నిరసన తెలిపారు. చినమిల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నిత్యావసర, ఇంధన ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీని ఓడిస్తే పెట్రోల్‌ ధరలు తగ్గుతాయంటూ ఎన్నికల్లో వేదాలు వల్లించిన లోకేష్‌ పెంచిన ధరలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, రాష్ట్ర కార్యదర్శి పాలవెల్లి మంగ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్‌, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఇంటి సత్యనారాయణ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బోకూరి విజయరాజు పాల్గొన్నారు.

ఉండిలో..

ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్‌ నరసింహరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉండి పార్కు వద్ద నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఇంధన ధరలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవీఎల్‌ మాట్లాడుతూ పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు కూటమి నేతలు కోతలు కోసి ఇప్పుడు ధరల పెంపుతో ప్రజలకు వాతలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ కార్యదర్శి కరిమెరక రామచంద్రరావు, ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి బడుగు బాలాజీ, క్రిస్టియన్‌ మైనారిటీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం బెన్హర్‌, జిల్లా గ్రీవెన్స్‌సెల్‌ అధ్యక్షుడు గళావిల్లు ధనుంజయ, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ జహంగీర్‌, జిల్లా కార్యదర్శి గుండా సుందరరామనాయుడు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెంలో..

తాడేపల్లిగూడెంలో పట్టణ మాజీ అధ్యక్షుడు గుండుబోగుల నాగు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రే ణులు పాల్గొని పట్టణంలో ర్యాలీ చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఆచంటలో..

ఆచంటలో పోడూరు జెడ్పీటీసీ సభ్యుడు గుంటూరి పెద్దిరాజు, పెనుగొండ ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు, ఆచంట మండల కన్వీనర్‌ జక్కంశెట్టి శ్రీరాములు, పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఉండి: ఉండిలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్‌ నర్సింహరాజు, నాయకులు

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు

సామాన్యులపై భారం మోపుతున్న కూటమి ప్రభుత్వంపై మండిపాటు

రాష్ట్రంలోనే ధరలు అధికమని ఆగ్రహం

అధికారులకు వినతులు అందజేసిన నేతలు

Advertisement
 
Advertisement
Advertisement