భీమవరం: పట్టణంలోని నాలుగు కేంద్రాల్లో సోమవారం ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 220 మందికి 214 మంది, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికి 194 మంది, డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 200 మందికి 192 మంది, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 300 మందికి 292 మంది హాజరయ్యారు.
తాడేపల్లిగూడెంలో..
తాడేపల్లిగూడెం: పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఈఏపీసెట్‌కు ఉదయం 240 మందికి 231 మంది, మధ్యాహ్నం 240 మందికి 233 మంది హాజరయ్యారు. ప్రిన్సిపాల్ రాంబాబు పర్యవేక్షించారు.
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్‌లలో అందిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇన్‌చార్జి కలెక్టర్, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌లో 157, రెవెన్యూ క్లినిక్‌లో 46 అర్జీలు స్వీకరించినట్టు చెప్పారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డీపీ ఓ వై.దోసిరెడ్డి, భీమవరం డీఎల్డీఓ ఎ.వెంకటలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: జిల్లాలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సమన్వయంతో పనిచేయా లని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈనెల 25 నుంచి జూన్ 4 వరకు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జిల్లాలో 23 కేంద్రాల్లో నిర్వహించనున్నామని 4,418 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు ఈనెల 25 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తామని, ఎస్‌ఎస్‌సీ పరీ క్షలకు నాలుగు కేంద్రాల్లో 478 మంది, ఇంటర్ పరీక్షలకు రెండు కేంద్రాల్లో 411 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. డీఈఓ ఈ.నారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జి. ప్రభాకరరావు, అధికారులు పాల్గొన్నారు.
భీమవరం: స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బాధితుల నుంచి 22 అర్జీలను స్వీకరించారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోపు చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం అధికారి ఏవీ సూరిబాబు తె లిపారు. జిల్లాలో 3 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం బాలురు 8, బాలికలు 6 హాస్టళ్లు, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థుల కోసం బాలురు 8, బాలికలు 7 హాస్టళ్లు నిర్వహిస్తున్నామన్నా రు. మొత్తంగా 29 హాస్టళ్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాలకు సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి, భీమవరం సెల్ 9441252102, 9490134897లో సంప్రదించా లని కోరారు. అలాగే సహాయ వెనుకబడిన త రగతుల సంక్షేమ అధికారి, నరసాపురంను కూడా సంప్రదించవచ్చన్నారు.


