పట్టించుకోని ప్రభుత్వం
రూ.2 లక్షలు నష్టం
ఎన్నడూ లేనంత దారుణంగా..
నూజివీడు: పండ్లలో రారాజుగా పిలుచుకునే మా మిడిని సాగుచేసే రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర ఎక్కువగా ఉంటుందని భావించిన రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. మామిడి కాయలకు గిట్టుబాటు ధర లభించక, పెట్టిన పెట్టుబడి రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. నూజివీడు డివిజన్ వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో ఉన్న మామిడి తోటలకు చెందిన రైతుల దుస్థితి దయనీయంగా తయారైంది. 25 వేల ఎకరాల్లో బంగినపల్లి రకం, 10 వేల ఎకరాల్లో కలెక్టర్ రకం, మిగిలిన 5 వేల ఎకరాల్లో చిన్నరసాలు, ఇతర రకాలు సాగవుతున్నాయి. డివిజన్‌లో ప్రధాన వాణిజ్య పంటగా విలసిల్లుతున్న మామిడి గత కొన్నేళ్లుగా నష్టాలను పంచుతోంది. రెండేళ్లుగా అయితే పరిస్థితులు దా రుణంగా తయారయ్యాయి. అయినా ప్రభుత్వం ఏమాత్రం రైతులను పట్టించుకోవడం లేదు.
పూత దశలోనే కుదేలై..
ఈ ఏడాది బంగినపల్లి, కలెక్టర్ రకాల్లో పూత బాగా వచ్చినా పిందె కట్టే దశలో నల్లతామర తెగులు ఆ శించడం, ప్రతికూల వాతావరణం వల్ల ఆశించిన స్థాయిలో పిందె కట్టకుండా పూతంతా రాలిపోయింది. దీంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. రైతులు పూత, పిందె నిలుపుకోవడం కోసం 10 నుంచి 12 సార్లు వరకు రసాయన మందులు పిచికారీ చేసినా లాభం లేకుండా పోయింది.
రోజురోజుకూ ధరల పతనం
మామిడి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో మామిడికి ధరలు మెరుగ్గా ఉన్నా రానురాను పతనమవుతున్నాయి. బంగినపల్లి రకానికి ప్రారంభంలో ముంబై మార్కెట్‌లో టన్నుకి రూ.1.20 లక్షలు సైతం ధర లభించింది. అది క్రమేణా పడిపోయి చివరకు రూ.40 వేలకు చేరగా ప్రస్తుతం కాయలు బాగుంటే టన్ను రూ.25 వేలు మాత్రమే లభిస్తోంది. స్థానిక మార్కెట్‌ల్లో టన్నుకి రూ.12 వేల నుంచి రూ.18 వేలు మాత్రమే లభిస్తోంది. దీనికి మరలా టన్నుకు వంద కిలోల కాయలను సూట్ పేరుతో తీసేస్తున్నారు. పది టన్నులు తీసుకెళ్తే టన్ను కాయలు సూట్ పేరుతో దోచుకుంటున్నారు. దీనికి తోడు కమీషన్ పేరుతో కూడా రైతులను దోచుకోవడంతో మామిడి రైతులకు కోత ఖర్చులు, కిరాయిలు రాని పరిస్థితి.
వేలాది మంది రైతులు ఆధారపడిన మామిడి నష్టాలను పంచుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. తామంటేనే ప్రభుత్వానికి అలుసుగా తయారైందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాకు 14 ఎకరాలు మామిడి తోట ఉండగా గతేడాది రూ.4 లక్షలు నష్టం వచ్చింది. దీంతో ఏడెకరాల్లో చెట్లు నరికించేసి అందులో ఆయిల్‌పామ్ వేశా. ఈ ఏడాది కూడా రూ.2 లక్షల నష్టం వచ్చింది. దీంతో మిగిలిన ఏడెకరాల్లోని మామిడి చెట్లు తొలగించి అందులో కూడా ఆయిల్‌పామ్ వేస్తా. మామిడిపై స్థిరమైన ఆదాయం రావడం లేదు.
– లావు ధనకోటేశ్వరావు,
కొత్తరావిచర్ల, నూజివీడు మండలం
తోతాపురి కాయలు కొనేవాళ్లే కనిపించడం లేదు. టన్ను రూ.3,500 అంటే కోత కూ లి, కిరాయిలు కూడా రావు. కోత కోసే బదులు తోటల్లోనే వదిలేస్తే ఖర్చులు అయినా మిగులుతా యి. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఆదాయం రాక చాలా మంది రైతులు తోటలు తీసేస్తున్నారు.
– పెద్దగమళ్ల ఆదినారాయణ, నూజివీడు
మామిడి.. ధర తడబడి
మరింత దిగజారిన ధరలు
బంగినపల్లి టన్ను రూ.12 వేల నుంచి రూ.18 వేలు
కలెక్టర్ టన్ను రూ.3,500
లబోదిబోమంటున్న రైతులు


