సార్వాకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

సార్వాకు సన్నద్ధం

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

ఎరువుల అవసరం (సుమారు)

విత్తనాల సేకరణ, మెట్టదుక్కులతో బిజీ

జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో సాగు

53,750 క్వింటాళ్ల విత్తనాలు అవసరం

భీమవరం: జిల్లాలో దాళ్వా మాసూళ్లు పూర్తికావస్తున్న తరుణంలో రైతులు సార్వా సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో దా ళ్వాలో 2.35 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా సార్వాలో 2.25 లక్షల ఎకరాల్లో నాట్లు వేయనున్నారు. సార్వాలో తుపానులు, అధిక వర్షాల నుంచి గట్టెంకేందుకు తగు విత్తన రకాలు ఎంపిక చేసువాల్సి ఉంది. ఈ మేరకు విత్తనాల సేకరణ పనిలో రైతులు నిమగ్నమయ్యారు. కొందరు రైతులు భూములను మెట్ట దుక్కులు చేస్తూ ఎత్తుపల్లాలను సరిచేసుకుంటున్నారు.

మేలైన వంగడాలివే.. సార్వాలో మేలైన వరి వంగడాలను ఎంపిక చేసుకుని అధిక దిగుబడుగులు సాధించాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. వాటిలో ఎంటీయూ 1318, ఎంటీయూ 1153,1156, స్వర్ణ రకాలను ఎంపిక చేసుకోవచ్చు. జిల్లాలో సార్వాకు సుమారు 53,750 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా 90 శాతానికి పైగా రైతులే నేరుగా సమకూర్చుకుంటారని అంచనా. జూన్‌ మొదటి వారంలో వరి నారుమడులు ప్రారంభించి ఆగస్టు 15 నాటికి నాట్లు పూర్తి చేస్తే తుపానులు, వరదల నుంచి పంటను కాపాడుకోవచ్చు. వరి నారుమడి నుంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో ఎక్కువ మంది రైతులు వరినాట్లు వేసే పద్ధతినే అవలంబిస్తున్నందున ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనాలు అవసరం కాగా, వెదజల్లు పద్ధతిలో ఎకరానికి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి.

నారు ఆరోగ్యం కోసం..

వరినారు దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉండాలంటే నారు వేసే ముందు మడిని 12 రోజుల ముందు దమ్ముచేసి నీరు పెట్టడానికి, తొలగించడానికి వీలు గా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సెంటు భూమిలో ఐదు కిలోల వంతున విత్తనాలు చల్లుకోవాలి. విత్త నం ఎక్కువైతే నారు బలహీనంగా ఉండి, మాగుడు తెగులు సోకే అవకాశం ఉంది. మొలక కట్టిన విత్తనాన్ని పలచటి నీటి మీద చల్లుకోవాలి. నారు రెండు, మూడు ఆకులు తొడిగే వరకూ ఆరుతడి పెడుతూ తరువాత పలుచగా నీరుండేలా చూసుకోవాలి.

ఎరువులు ఇలా..

దమ్ములో ప్రతి ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోల యూరియా, 7 కిలోల సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌, 2 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసుకోవాలి. విత్తనాలు వేసిన రెండు వారాల తర్వాత మరలా 2 కిలోల యూరియా పైపాటుగా వేయాలి. అవసరాన్ని బట్టి నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. జిల్లాలో ఎరువుల అవసరంపై వ్యవసాయశాఖ అంచనా వేసింది. వీటిని రైతు సేవాకేంద్రాలు, పీఏసీఎస్‌లు, ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద నిల్వ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

రకం టన్నులు

యూరియా 18,000

కాంప్లెక్స్‌ 16,000

డీఏపీ 1,600

పొటాష్‌ 4,200

సూపర్‌ 4,200

Advertisement
 
Advertisement
Advertisement