భవిష్యత్తుకు భరోసా ఉద్యాన విద్య
● ఆకర్షిస్తున్న కోర్సులు
● ఉపాధికి, ఉద్యోగానికి ఢోకా లేదు
● విదేశీ విద్యార్థుల ఆసక్తి
ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థులు ఈ కోర్సులో చేరవచ్చు. 31–12–2026 నాటికి వయస్సు 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 ఏళ్లు, దివ్యాంగులకు 27 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. వర్సిటీ పరిధిలో నాలుగు ప్రభుత్వ ఉద్యాన కళాశాలలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం కళాశాలలో 100 సీట్లు, అన్నమయ్య జిల్లా అనంతరాజుపేట కళాశాలలో 100 సీట్లు, వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో 60 సీట్లు, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం, నెల్లూరు జిల్లా చినలాటరిపి కళాశాలల్లో 50 సీట్ల చొప్పున ఉన్నాయి. వర్సిటీ అనుబంధ కళాశాలలైన అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్, ప్రకాశం జిల్లా మార్కాపురం, చంద్రశేఖరపురంలోని కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 60 సీట్ల చొప్పున మొత్తం 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లను ఏపీ ఈఏపీసెట్ మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
హార్టికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు 15 శాతం కోటా ఉంటుంది. దీని ద్వారా హార్టీసెట్ మెరిట్ ఆధారంగా యూనివర్సిటీ కళాశాలల్లో 54 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 27 సీట్లు భర్తీ చేస్తారు. ఐసీఏఆర్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికై న వారికి 20 శాతం సీట్లు, స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ద్వారా విదేశీ విద్యార్థులకు 70 సీట్లు కేటాయిస్తారు. ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్‌షిప్ కోటాలో 47 సీట్లు, ఇండస్ట్రీ కోటాలో ఆరు సీట్లు ఉన్నాయి. రైతు కోటా కింద కనీసం ఒక ఎకరం పొలం కలిగిన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు నిబంధనల మేరకు సీట్లు కేటాయిస్తారు.
తాడేపల్లిగూడెం : పచ్చని ప్రకృతి ఒడిలో చదువుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? అచ్చంగా ఇలాంటి వాతావరణంలోనే తాడేపల్లిగూడెం పరిధిలోని వెంకట్రామన్నగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు చక్కని అవకాశాలను కల్పిస్తోంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉద్యాన విద్యకు క్రేజ్ బాగా పెరిగింది. ఈ విద్యను అభ్యసిస్తే కొలువులకు కొదువ లేదు, ఉపాధికి బోలెడు అవకాశాలున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా మారుతున్న కోర్సులు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ మానస పుత్రికగా 2007లో దేశంలోనే రెండో విశ్వవిద్యాలయంగా ఇది ఊపిరి పోసుకుంది. ఐసీఏఆర్ పరిధిలో ఏ–గ్రేడ్ సాధించిన ఈ వర్సిటీ, 2026–27 విద్యాసంవత్సరానికి గాను పాలిటెక్నిక్, డిగ్రీ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సు
ఉద్యోగం, ఉపాధి, ఉన్నత విద్యకు చక్కని అవకాశం కల్పించే ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు అర్హులు. 31–08–2026 నాటికి 15 నుంచి 22 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఈ కోర్సు కాలపరిమితి రెండేళ్లు కాగా, బోధన పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. వర్సిటీ పరిధిలోని నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 200 సీట్లు, మూడు ప్రైవేటు కళాశాలల్లో 120 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కళాశాలల్లో 60 సీట్ల చొప్పున ఉన్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు, అన్నమయ్య జిల్లా కలికిరి, ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా మద్దిరాల, నంద్యాల జిల్లా కోయిలకుంట్ల కళాశాలల్లో 40 సీట్ల చొప్పున కేటాయించారు. ఈ ఏడాది పాలిటెక్నిక్‌లో ల్యాండ్ స్కేపింగ్, నర్సరీ మేనేజ్‌మెంట్ కోర్సును రామచంద్రపురం, మడకశిర కళాశాలల్లో ప్రవేశపెట్టారు. ఈ ప్రత్యేక కోర్సు కోసం మొత్తం 50 సీట్లు కేటాయించారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఎరువులు, పురుగు మందుల కంపెనీలు, వివిధ ఉద్యాన పరిశ్రమల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
నాణ్యమైన విద్యాబోధన – వసతులు
అనుభవజ్ఞులైన అధ్యాపకులు, శాస్త్రవేత్తలతో డిజిటల్ తరగతులు, అత్యాధునిక ప్రయోగశాలల ద్వారా ఇక్కడ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఐసీఏఆర్ ఆరవ డీన్స్ కమిటీ సిఫారసుల మేరకు ఇక్కడ పాఠ్యాంశాల బోధన జరుగుతుంది. చదువుతో పాటు ఆటలు, క్రీడలు, సెంట్రల్ లైబ్రరీ సౌకర్యాలు ఉన్నాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా సురక్షితమైన వసతి గృహాల (హాస్టల్) సదుపాయం కల్పించారు.
విస్తృత ఉద్యోగావకాశాలు
రాష్ట్ర సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల ద్వారా అభ్యర్థులు మండల హార్టికల్చర్ ఆఫీసర్, హెచ్‌ఈఓ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చు. ఐసీఏఆర్, డీఆర్‌డీఓ, స్పైసెస్ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డు, టీ బోర్డులలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలనుకునే హార్టీకల్చర్ గ్రాడ్యుయేట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ్ఖ్కఇ) పరీక్షలకు హాజరు కావచ్చు. ప్రైవేటు రంగంలో కొలువులతో పాటు, స్వయం ఉపాధి పొందేందుకు ఉద్యాన విద్య ఎంతగానో దోహదపడుతుంది.
ఉద్యాన వర్సిటీ ముఖద్వారం
ఉద్యాన విద్య అనేది యువత భవిష్యత్తుకు బాటలు వేసే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం. పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ పంటల ఉత్పత్తి ద్వారా దేశ ఆహార భద్రతకు, పోషకాహార లభ్యతకు, రైతుల ఆదాయ వృద్ధికి ఉద్యానరంగం ఎంతో కీలకంగా మారింది. ప్రభుత్వం రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తుండటంతో, ఉద్యాన విద్యార్థులకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి, అగ్రి బిజినెస్, స్టార్టప్‌లు, ఎగుమతి రంగాలలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడుతూ సమాజానికి సేవ చేయాలనుకునే యువత ఉద్యాన విద్యను ఎంచుకోవాలి.
– డాక్టర్ కె.ధనుంజయరావు, వీసీ, ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం


