రుణాలు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి చర్చిలో విగ్రహాల ధ్వంసంపై కేసు నమోదు అదృశ్యమైన మహిళ మృతి

పెనుగొండ: డ్వాక్రా మహిళలకు, రైతులకు అందిస్తున్న వ్యవసాయ రుణాలను, ఇతర రుణాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ హెడ్‌ వీరభద్రరావు తెలిపారు. శనివారం ఆచంటలో యూనియన్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో అగ్రికల్చర్‌ ఔట్‌ రీచ్‌ కార్యక్రమాన్ని ఆచంట చాంబర్‌ కమిటీ హాల్‌లో నిర్వహించి రుణాల చెక్కులను అందించారు. యూనియన్‌ బ్యాంక్‌లో వ్యవసాయ రుణాలు, ఇతర పథక రుణాలపై అవగాహన కల్పించారు. డిపాజిట్లపై వచ్చే వడ్డీని, తిరిగి తక్కువ వడ్డీకి తీసుకొనే అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్‌ ఫణి, ఏపీఎం రామకృష్ణ, ఆచంట బ్రాంచ్‌ మేనేజరు కే సుధాకర్‌, సీహెచ్‌ శ్రీనివాస్‌, దివ్య రాంబాబు, కేతా రామకృష్ణ, కోట వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.

భీమవరం: భీమవరం పట్టణం బలుసుమూడి ఎస్టీ కాలనీ చర్చిలో మేరిమాత, ఏసుప్రభు విగ్రహాలను ధ్వంసం చేశారని చర్చి పాస్టర్‌ ఎన్‌. స్టాలిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ ఎస్‌ఐ రామారావు శనివారం చెప్పారు. ఈ నెల 13వ తేదీ రాత్రి చర్చి పక్కన గల ఖాళీ స్థలంలో ఐదుగురు వ్యక్తులు మద్యం సేవించి, అక్రమంగా చర్చిలోనికి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

జంగారెడ్డిగూడెం: అదృశ్యమైన మహిళ మృతదేహం శనివారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎర్రకాలువలో లభ్యమైంది. ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంకు చెందిన తోట మేరీ (45) ఈ నెల 7న ఇంటి నుంచి అదృశ్యమైంది. మేరీ సోదరుడు గండే సురేష్‌ వద్ద ఉంటోంది. ఆమె కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా.. ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 12వ తేదీన జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి మేరీ ఆచూకీ కోసం పోలీసులు, ఆమె కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. శనివారం మధ్యాహ్న ఎర్రకాలువలో కుటుంబసభ్యులకు మృతదేహం లభించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని మేరీ మృతదేహాన్ని గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసును మార్చి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement