న్యూస్‌రీల్
రెండేళ్లలో ఫీడ్ టన్నుకు రూ.40 వేలు పెరుగుదల
వేసవి తాపం.. చేపకు శాపం
ఆక్వా రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో చెరువుల్లో చేపలను రక్షించేందుకు ఆక్వా రైతులు నానా పాట్లు పడుతున్నారు. 8లో u
శురకవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026
భీమవరం: దేశానికి విదేశీమారక ద్రవ్యం తెచ్చిపెడుతున్న ఆక్వా రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కంపెనీ యజమానులు ఆక్వా ఫీడ్ ధరలు దారుణంగా పెంచడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం కంటితుడుపు చర్యలు తీసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఒక పక్క ఆక్వా ఫీడ్ ధరలు భగ్గుమంటున్నాయని గగ్గోలు పెడుతుంటే.. ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడాన్ని రైతులు తీవ్రంగా తప్పపడుతున్నారు. ఇప్పటికే మొన్నటివరకు విద్యుత్ కోతలు, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు మూలిగేనక్కపై తాడిపండు పడినట్లు ఒక్కసారిగా క్వింటాళ్ల రొయ్యల మేతను రూ.16 వేలు పెంచేశారు. దీనిని పూర్తిగా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం కంపెనీ యజమానులతో మాట్లాడతామంటూ చేస్తున్న సన్నాయినొక్కులు ఎవరి కోసమంటూ ప్రశ్నిస్తున్నారు.
1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు
వ్యవసాయమే జీవనాధరమైన జిల్లాలో గత కొన్నేళ్లుగా రొయ్యలు, చేపల సాగుతో ఇక్కడి జీవన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆక్వా సాగు రైతులు, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుండగా లక్షలాది మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో ముందుగా తీరప్రాంతమైన నరసాపురం, భీమవరం నియోజకవర్గాల పరిధిలో ప్రారంభమైన రొయ్యలు, చేపల సాగు ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలకు విస్తరించింది. దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా దానిలో సుమారు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగే. ప్రతి ఏటా మూడు పంటలు పండిస్తున్న రొయ్యల రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ, సహకారాలు లభించకపోవడంతో క్రాప్ హాలీడే ప్రకటించాలనే నిర్ణయానికి వస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడం, ఽరొయ్యల ధరలు నిలకడగా లేకపోవడంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. 2024 ఎన్నికల సమయంలో రైతులందరికీ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్ రూ.1.50 ఇస్తామని ప్రకటించిన కూటమి నాయకులు అందలమెక్కి రెండేళ్లు కావస్తున్నా సబ్సిడీ విద్యుత్ మాట ఎత్తకపోవడం పట్ల మండిపడుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్సడా ఏర్పాటుచేసి రొయ్యల ధరలు నిలకడ, ఫీడ్, సీడ్ ధరలపై నియంత్రణ ఏర్పాటుచేసి రైతులకు అండగా నిలవగా నేటి చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రైతులను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఫీడ్ ధరల పెంపుతో రైతులపై దాదాపుగా రూ.400 కోట్లు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఽఫీడ్ ధరల పెంపుతో ఆందోళన బాట పట్టడానికి రైతులు సంసిద్ధం అవుతుండగా వారికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల కాలంలో రొయ్యల మేత ధర టన్నుకు దాదాపు రూ.40 వేలు పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టన్ను ఫీడ్ ధర రూ.70 వేలు నుంచి రూ.80 వేలు ఉంటే, నేడు టన్ను రూ.1.22 లక్షల వరకు పెరిగిందని, అయితే రొయ్యల ధర మాత్రం 100 కౌంట్ రూ.240 కంటే తక్కువగానే ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల్లోనే టన్ను రొయ్యల మేత దాదాపు రూ.16 వేలు పెరగడంతో ఆందోళన చెందుతున్న రైతులకు పూర్తిస్థాయిలో ఊరట కలిగించకపోగా తాత్కాలిక తగ్గింపు అంటూ వ్యవసాయశాఖామంతి అచ్చెన్నాయుడు ప్రకటించడాన్ని తీవ్రంగా మండిపడుతున్నారు. రొయ్యల మేత తయారీ ముడిసరుకు ధరలు పెరగకపోయినా ఫీడ్ ధరలు పెంచడాన్ని ప్రభుత్వం సమర్థించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆక్వా ఫీడ్ ధరలపై ఆందోళన
ధరల తాత్కాలిక తగ్గింపుపై మండిపాటు
పెంచిన ధరలు తగ్గించాలంటూ డిమాండ్
రెండేళ్లలో టన్నుకు దాదాపు రూ.40 వేలు పెంపు
రొయ్యల ధరలు మాత్రం 100 కౌంట్ రూ.240 లోపే
జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు
పెరిగిన ఫీడ్ ధరతో రైతులపై రూ.400 కోట్ల భారం
రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరుబాటకు సిద్ధం


