అంగన్‌వాడీల పదోన్నతుల్లో అన్యాయం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల పదోన్నతుల్లో అన్యాయం

May 15 2026 12:19 PM | Updated on May 15 2026 12:19 PM

అంగన్‌వాడీల పదోన్నతుల్లో అన్యాయం వాణిజ్య పన్నుల వసూళ్లలో లక్ష్యాలను సాధించాలి ట్రిపుల్‌ఐటీల అభివృద్ధికి పటిష్టమైన చర్యలు నేడు 22ఏ మెగా పరిష్కార మేళా

భీమవరం: అంగన్‌వాడీ పదోన్నతుల విషయంలో అవకతవకలు జరిగాయని, కొన్ని ప్రాంతాల్లో రాజకీయ ఒత్తిడిలు పనిచేస్తున్నాయని, దీనిపై వెంటనే విచారణ జరపాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి డి కళ్యాణి గురువారం డీఆర్వో శ్రీమన్నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. హెల్పర్లకు పదోన్నతి విషయంలో అనేక పోరాటాలు చేసి జీవోలు సాధించుకున్నా అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతుల్లో విషయంలో అధికారులు సైతం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపించేంత వరకు పోస్టుల భర్తీని పెండింగ్‌లో పెట్టాలని కోరారు. ఆమె వెంట కె జాన్సీలక్ష్మి, ఎండీ హసీనా బేగం ఉన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో వివిధ రంగాల నుంచి రావాల్సిన వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్య సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. గురువారం వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు నిర్ధేశించిన రూ.485 కోట్ల లక్ష్యానికిగాను 85.41 శాతం వసూళ్లు సాధించామని, వృత్తి పన్ను వసూళ్లలో 86.72 శాతం సాధనతో రాష్ట్రంలో జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.543.02 కోట్ల వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించగా ఇంకా వృత్తి పన్ను ద్వారా రూ.16.65 కోట్లు, ఇతర బకాయిల ద్వారా రూ.40.61 కోట్లు, వ్యాట్‌ పాత చలాన్ల ద్వారా రూ.35.42 కోట్ల వసూళ్ల లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ బి.నాగార్జున రావు, డిప్యూటీ కమిషనర్‌ కేపీ శైలజశ్రీ, సహాయ కమిషనర్లు డి.సాంబశివరావు, ఏవీ శ్రీనివాస్‌, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జీ పిచ్చయ్య, లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ ఏ.నాగేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌ దరఖాస్తులపై సమీక్ష

పీజీఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారంలో అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సూచించారు. గురువారం పలువురు అర్జీదారులతో ఆమె ఫోన్‌ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కార స్థాయిని సమీక్షించారు.

నూతన వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు

నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీల పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలలో నాణ్యమైన సాంకేతిక విద్యను అందించేందుకు మరింత కృషి చేస్తానని వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు పేర్కొన్నారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నూజివీడు ట్రిపుల్‌ఐటీకి విచ్చేసిన ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడారు. పదో తరగతి పూర్తయిన వెంటనే విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీల్లోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో జాయిన్‌ అవుతున్నారని, వారిని దేశానికి ఉపయోగపడే భావిభారత ఇంజినీర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తన 26 ఏళ్ల అధ్యాపక బోధన అనుభవంతో ట్రిపుల్‌ ఐటీల్లో సంస్కరణలను తీసుకువచ్చి మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్తానన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయోగపడే నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా బోధన సాగేలా చర్యలు చేపడతామన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో ఆర్జీయూకేటీ పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడించేలా పనిచేస్తామన్నారు. వైస్‌ఛాన్సలర్‌ను ట్రిపుల్‌ ఐటీలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, మెంటార్లు, బోధనేతర సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ‘22ఏ మెగా పరిష్కార మేళా’ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ పాల్గొని, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసు కోవాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement