దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాఽథరావు వెల్లడి
ద్వారకాతిరుమల: శ్రీవారి పులిహోర ప్రసాదంలో నమిలేసిన ములక్కాయ ముక్కలు వచ్చాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటి వరకు భక్తుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. వివరాల్లోకి వెళితే. తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన విప్పిలి నరేష్ అనే వ్యక్తి తాను తెప్పించుకున్న శ్రీవారి పులిహోర ప్రసాదంలో నమిలేసిన ములక్కాయ ముక్కలు వచ్చాయంటూ వీడియోలను సోషల్ మీడియాలో బుధవారం రాత్రి పోస్ట్ చేశాడు. అయితే ప్రసాదంలో అవి పొరపాటున వచ్చాయా.. లేక ఎవరైనా కావాలనే ఇది చేశారా.. అన్న భక్తుల అనుమానాలపై సాక్షి దినపత్రిక గురువారం ‘శ్రీవారి ప్రసాదం నాణ్యతపై దుమారం’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పందించి, అధికారులను వివరణ కోరారు. ఇదిలా ఉంటే విచారణ జరిపిన ఈఓ త్రినాథరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. స్వామివారి లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి ప్రసాదాలు శుచి, శుభ్రత కలిగిన ప్రత్యేక భవనం (అంబరుఖానా)లో తయారవుతాయని పేర్కొన్నారు. సిబ్బంది చేతులకు గ్లౌజ్‌లు, నోటికి మాస్క్‌లు, తలకు క్యాప్‌లు ధరించిన తరువాతే ప్రసాదాలను తయారు చేసి, ప్యాకింగ్ చేస్తారన్నారు. ఎవరైనా తిని పడేసిన ములక్కాయ ముక్కలు పులిహోర ప్రసాదంలో కలిశాయని అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదన్నారు. ఎందుకంటే అంబరుఖానాలో అసలు ఎవరూ భోజనాలు చేయరన్నారు. అన్నప్రసాద భవనం, ప్రసాదాల తయారీ భవనం రెండూ వేరువేరుగా ఉండటం వల్ల ఇలాంటివి జరిగే వీలు లేదన్నారు. కావున భక్తులు దీన్ని గమనించాలని ఈఓ కోరారు.
ఇలా జరగడం ఇది రెండోసారి..
రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి శ్రీవారి పులిహోర ప్రసాదంలో పురుగు వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పట్లో అది తీవ్ర దుమారాన్ని రేపింది. మళ్లీ ఇప్పుడు పులిహోర ప్రసాదంలో నమిలేసిన ములక్కాయ ముక్కలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అధికారులకు కనీసం ఫిర్యాదు చేయకుండా సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేయడం వల్ల ప్రసాదాల పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. అసలు సోషల్ మీడియాలో పెట్టే ఈ పోస్టుల్లో వాస్తవం ఉందా.. లేదా అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్టులపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను నిగ్గుతేల్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


