గిరిజనాభివృద్ధికి గ్రహణం | - | Sakshi
Sakshi News home page

గిరిజనాభివృద్ధికి గ్రహణం

May 15 2026 12:19 PM | Updated on May 15 2026 12:19 PM

బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వం గిరిజనాభివృద్ధిని గాలికి వదిలేసింది. సమస్యల పరిష్కారానికి వేదిక కావల్సిన కోటరామచంద్రపురం (కేఆర్‌పురం) ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రెండున్నర సంవత్సరాలుగా నిర్వహించకపోవడంపై గిరిజన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన పాలకవర్గ సమావేశం రెండున్న సంవత్సరాలుగా నిర్వహించలేదు. గిరిజన సంక్షేమ పథకాల అమలు తీరు, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, వార్షిక బడ్జెట్‌ రాబడులు, వ్యయాలపై సమీక్షకు పాలక వర్గ సమావేశం ఎంతో కీలకమైనది. అంత ప్రాముఖ్యత ఉన్న ఈ సమావేశం నిర్వహణ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని గిరిజన సంఘ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

పట్టించుకునే వారే లేరు

కేఆర్‌పురం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం 2023 ఆగస్టు 30న నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహణకు సంబంధించి ఎవ్వరూ పట్టించుకోలేదు. గిరిజన గ్రామాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని గిరిజనులు చెబుతున్నారు. గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేక గిరిపుత్రులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అలాగే పోడుభూములకు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకునే వారే లేరని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలల్లో కొత్తగా వస్తున్న విద్యా విధానంతో అనేక మంది గిరిజన విద్యార్థులు డ్రాప్‌ అవుట్స్‌గా మారే అవకాశం ఉందని గిరిజన సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇలా అనేక సమస్యల పరిష్కారానికి పాలకవర్గ సమావేశం వేదికగా ఉంటుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ఐటీడీఏ పీఓ రాములు నాయక్‌ను వివరణ కోరగా త్వరలోనే పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

రెండున్నరేళ్లుగా నోచుకోని ఐటీడీఏ పాలకవర్గ సమావేశం

గిరిజన ప్రాంతంలో ఎక్కడి సమస్యలు అక్కడే

తక్షణమే సమీక్ష ఏర్పాటు చేయాలని గిరిజన సంఘాల డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement