గణపవరం: మండలంలోని కొందేపాడు గ్రామంలో నిల్వ మైదాపిండితో చేసిన బజ్జీలు తిని 13 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనకు సంబంధించి అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. గురువారం రాష్ట్ర ఫోరెన్సిక్ సహాయ సంచాలకులు శ్రీనివాస్, గణపవరం సిఐ నక్కారజనీకుమార్ వైద్య శాఖ అధికారులు కొందేపాడుగ్రామంలో బజ్జీలు వేసిన ఇంటిని పరిశీలించారు. వంట గదిలో మైదాపిండిని, నూనె తదితర వస్తువులను వారు పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. ఘటనుకు గల కారణాలు తెలుసుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు. కొందేపాడు గ్రామంలో బుధవారం చేపల చెరువు వద్ద గోదాములో నిల్వ ఉన్న మైదా పిండిని చెరువు వద్ద పనిచేసే మిరియాల మణికంఠ అనే వ్యక్తి తెచ్చి తమ సమీపబంధువైన ముఖమట్ల కనకదుర్గకు ఇవ్వడం, ఆమె ఆ మైదా పిండితో వేసిన బజ్జీలు కుటుంబసభ్యులతోపాటు ఇరుగు పొరుగువారికి ఇవ్వడం, అవి తిన్న 13 మంది వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందడం తెలిసిందే. అయితే ఒకరిద్దరు తప్ప మిగిలిన బాధితులంతా కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఇద్దరి పరిస్థితి కూడా మెరుగుపడుతున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. గ్రామంలో పిప్పర పీహెచ్‌సీ వైద్యాధికారులు కె.ప్రియాంక, రియోలతో పాటు ప్రథమ చికిత్స శిబిరం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ కొత్త కేసులు ఏమీ లేవని వైద్యాధికారులు తెలిపారు. మరో 24 గంటల పాటు గ్రామంలోనే ఉండి పరిస్థితిని పరిశీలిస్తామని వారు తెలిపారు.


