పిల్లలు లేకున్నా హాజరు | - | Sakshi
Sakshi News home page

పిల్లలు లేకున్నా హాజరు

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

పిల్లలు లేకున్నా హాజరు గిన్నిస్‌ బుక్‌లో స్థానం మనస్తాపంతో ఆత్మహత్య ధాన్యం లోడు ట్రాక్టర్‌ బోల్తా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చోరీ కేసు నమోదు

జంగారెడ్డిగూడెం: పిల్లలు లేకున్నా రిజిస్టర్‌లో హాజరు వేస్తున్నారు. ఇది మండలంలోని మైసన్నగూడెం గ్రామంలోని అంగన్‌వాడీ ప్రీస్కూల్‌ పరిస్థితి. అంగన్‌వాడీ కేంద్రం సరిగా నిర్వహించడం లేదని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ వంటిపల్లి విజయకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌ పరిస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ తెరిచి ఉన్నప్పటికీ పిల్లలు గాని, సిబ్బందిగానీ లేరు. విద్యార్థులు వచ్చినట్లు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. నిర్వాహకులు, సూపర్‌వైజర్‌పై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

భీమవరం: భీమవరం పట్టణానికి చెందిన గండి నానిబాబుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్ధానం దక్కింది. ఫిబ్రవరి 2న గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు హైదరాబాద్‌లో నిర్వహించిన సామూహిక కీబోర్డు ప్లే కార్యక్రమంలో ఆర్గనైజర్‌గా సేవలందించిన నానిబాబుకు సంస్థ జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని హెల్లెల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ వ్యవస్థాపకుడు డి.అగస్టీన్‌ చేతుల మీదుగా అందించారు.

ఉండి: భార్యా భర్తల మధ్య మనస్పర్ధల కారణంగా భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కథనం ప్రకారం ఉండి మండలం పాందువ్వకు చెందిన వీధి నవీన్‌కుమార్‌(28)కు ఏడాది క్రితం వివాహమైంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో నవీన్‌కుమార్‌ ఈ నెల 11న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని కువైట్‌లో ఉంటున్న తల్లికి ఫోన్‌ చేసి చెప్పాడు. ఆమె వెంటనే గ్రామంలోని మేనమామకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే వెళ్ళి అతనిని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఉండి : ధాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ బోల్తా కొట్టింది. యండగండి, ఉణుదుర్రు మధ్య ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. గణపవరం మండలం నుంచి భీమవరం మిల్లుకు ట్రాక్టర్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ట్రాక్టర్‌లో కొన్ని ధాన్యం బస్తాలు పక్కనే వున్న ఉండి కాలువలో పడిపోయాయి.

ముసునూరు: రాళ్ల దాడి ఘటనలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఎం. చిరంజీవి తెలిపారు. మండలంలోని చింతలవల్లికి చెందిన డేరంగుల గంగయ్య (45) పై ఈ నెల 7వ తేదీ గురువారం గ్రామానికి చెందిన కలపాల నాగరాజు మద్యం మత్తులో విచక్షణా రహితంగా రాళ్లతో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు బాధితుడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు.

జంగారెడ్డిగూడెం: బంగారు వస్తువుల చోరీకి సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. చైతన్యమిత్ర ఈ నెల 9న హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి కుటుంబంతో కలిసి వెళ్ళాడు. మంగళవారం చైతన్యమిత్ర ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని ఇంటి పక్కవారు గమనించి చైతన్యమిత్రకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన చైతన్యమిత్ర ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువాలో ఉంచిన 15 గ్రాముల బంగారు వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement