అమెరికా విధ్వంసం ప్రపంచానికి ముప్పు | - | Sakshi
Sakshi News home page

అమెరికా విధ్వంసం ప్రపంచానికి ముప్పు

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

తణుకు అర్బన్‌: అమెరికా చేస్తున్న విధ్వంసం ప్రపంచ వ్యాప్తంగా చెడు పరిణామాలకు దారితీస్తుందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం స్థానిక రోటరీ క్లబ్‌లో అమెరికా యుద్ధోన్మాదం – కారణాలు – పరిష్కారం అనే అంశంపై సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పీవీ ప్రతాప్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై కమ్యూనిస్టులు తక్కువ మాట్లాడుతున్నారని మిగిలిన వారు ఎక్కువగా మాట్లాడుతున్నారని అన్నారు. అమెరికా, ఇజ్రాయేలు కలిసి చేస్తున్న యుద్ధం మామూలుది కాదని చిన్న దేశంపై చేస్తున్న పెద్ద యుద్ధమని అన్నారు. ఇరాన్‌లోని ప్రధాన బ్రిడ్జిలన్నిటినీ ధ్వంసం చేశారని, ప్రధానం క్రూడ్‌ ఆయిల్‌, పెట్రోలు, డీజిల్‌ తయారుచేసే శుద్ధి కర్మాగారాల్ని బాంబులు వేసి ధ్వంసం చేశారని విమర్శించారు. యుద్దంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, యుద్ధానికి ముందు 70 డాలర్లు ఉండే క్రూడ్‌ ఆయిల్‌ ధరలు నేడు 100 డాలర్లకు చేరిందన్నారు. ఐటీ ఉద్యోగులను మీ ఇళ్ల నుంచి పనిచేయమని ప్రధాని మోదీ చెప్పడం హస్యాస్పదమని, ప్రధాన మంత్రిని కూడా వర్క్‌ ఫ్రం హోం చేయమనాలని అన్నారు. భవిష్యత్తులో డీజిల్‌, పెట్రోలు వంటివి రేషన్‌ లాగా నిబంధనలు పెట్టి ఇచ్చే పరిస్థితులు వస్తాయని ఎద్దేవా చేశారు. అమెరికా చెప్పినట్లు వినకుండా యుద్ధాన్ని ఆపే విధంగా ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.బలరామ్‌, దారిదీపం సంపాదకులు డీవీవీఎస్‌ వర్మ, లౌకిక రాజ్యాంగ వేదిక నాయకులు సంకు మనోరమ, సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సామాజిక న్యాయపోరాట సమితి నాయకులు పేరూరి మురళి, డాక్టర్‌ వంక రామదాసు తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు

Advertisement
 
Advertisement
Advertisement