వారం రోజుల్లో వస్తాయి
భీమవరం: త్వరలో నూతన విద్యాసంవత్సరం ప్రా రంభం కానుండగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు అందించాల్సిన నోట్ పుస్తకాలు ఇప్పటికీ బడులకు చేరలేదు. జిల్లాలోని 20 మండలాల్లో 1,399 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 90 వేల విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలతోపాటు స్కూల్ బ్యాగ్స్, షూస్, బెల్ట్‌లు వంటివి స్కూల్ తెరిచిన రోజునే అందించాల్సి ఉంది. వేసవి సెలవుల అనంతరం వచ్చే నెల 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని పాఠ్య పుస్తకాలు మారుతున్నందున సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో పాఠశాలలకు ఆయా పుస్తకాలు పంపిణీ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యాయి. మొత్తంగా విద్యార్థులకు సుమారు 4.75 లక్షల టెస్ట్ బుక్స్ అవసరమవుతాయని గుర్తించారు.
నోట్ పుస్తకాలు ఎప్పుడు వస్తాయో?
జిల్లాలోని మొత్తం సర్కారీ బడుల్లోని విద్యార్థులకు సుమారు 7 లక్షల వరకు నోట్ పుస్తకాలు, సుమారు 86 వేల స్కూల్ బ్యాగ్స్ అవసరమవుతాయి. అయితే ఇప్పటివరకు వీటి పంపిణీ ప్రారంభం కాలేదు. కేవలం పాఠ్య పుస్తకాలను మాత్రమే ఆయా మండలాలకు పంపుతున్నారు. ముందుగా మండలంలోని ఓ పాఠశాలకు చేరవేసి అక్కడి నుంచి అన్ని పాఠశాలలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నోట్ పుస్తకాలు మాత్రం ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. నోట్ పుస్తకాలతోపాటు బ్యాగ్స్, షూస్, బెల్ట్ వంటివి కూడా జిల్లాకు రావాల్సి ఉంది. గతేడాది పంపిణీ చేసిన స్కూల్ బ్యాగ్స్‌లో నాణ్యత లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుత ఏడాదికి నాణ్యమైన బ్యాగ్స్, బెల్ట్‌లు పంపిణీ చేయకుంటే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశమున్నందున విద్యాశాఖ అధికారులు ఆందోళనకు గురవుతున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి త్వరితగతిన నోట్ పుస్తకాలు, బ్యాగ్స్ మండల కేంద్రాలకు చేరితే అక్కడి నుంచి స్కూల్స్ తెరిచే సమయానికి అన్ని పాఠశాలలకు పంపిణీ చేసేందుకు అవకాశముంటుందని అధికారులు అంటున్నారు.
నోట్ దిస్ పాయింట్
మొదలుకాని నోటు పుస్తకాల పంపిణీ
విద్యా సామగ్రి పంపిణీపైనా స్పష్టత కరువు
మండలాల వారీగా పాఠ్య పుస్తకాలు మాత్రమే అందజేత
జిల్లాలో 1,399 పాఠశాలలు.. 90 వేల మంది విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలలకు మరో వారంలో నోట్ పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని 17 మండలాలకు సంబంధించి టెస్ట్ బుక్స్‌ను మండల కేంద్రాలకు చేరుస్తున్నాం. నోట్ బుక్స్, బ్యాగ్‌లు ప్రభుత్వం సరఫరా చేయగానే ఆయా స్కూల్స్‌కు చేర్చేలా ఏర్పాట్లు చేస్తాం. – పి.శ్యామ్‌సుందర్, ఏపీసీ, భీమవరం


